మద్యం మత్తులో ఉన్న యువకుడిని చికెన్ పకోడి కావాలని అడిగిన ఐదేళ్ళ బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వెల్లవేడు వద్ద జరిగింది. వెల్లవేడు ఇటుక బట్టీలో ఒడిశా నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు పనిచేస్తున్నాయి. అక్కడే పనిచేసే నిలక్కర్ అనే యువకుడు రెండ్రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను బజారుకు తీసుకెళ్లాడు. తెలిసిన వ్యక్తే కావడంతో నిలక్కర్తో కలిసి ఆ చిన్నారి వెళ్లింది. ఆ మరుసటి రోజు ఉదయం ఇటుక చాంబర్ వద్ద తీవ్ర గాయాలతో చిన్నారి శవమై కనిపించింది. పోలీసుల విచారణలో నిలక్కరే నిందితుడని నిర్ధారించుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం చెప్పాడు. చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని బజారుకు తీసుకెళ్లానని, వచ్చేటప్పుడు తనకోసం మద్యం, చికెన్ పకోడి తెచ్చుకున్నట్లు నిలక్కర్ పోలీసులకు తెలిపారు. ఇటుక చాంబర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద బైక్ ఆపి మద్యం తాగుతుండగా చిన్నారి చికెన్ పకోడి కావాలని పదేపదే అడగడంతో చిరాకు వచ్చి వంతెన పైనుంచి తోసేసినట్లు చెప్పాడు. బాలిక చనిపోవడంతో శవాన్ని తీసుకొచ్చి ఆమె ఇంటి సమీపంలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడు నిలక్కర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.