మైసూరులో దారుణం చోటు చేసుకుంది. కుమారుడి చేతిలో తండ్రి, మరో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు… ఇక్కడి నగరంలోని కేజీ కొప్పలులో శివ ప్రకాశ్ నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు సాగర్. ఇదిలా ఉంటే శివప్రకాశ్, అతని స్నేహితుడు నాగరాజు కలిసి పలు వ్యాపారాలు చేశారు. 2016లో నాగరాజు అనారోగ్యంతో మృతి చెందాడు.
ఆ సమయంలో నాగరాజు తనకు ఆరోగ్యం సరిగా లేదని, తన భార్య లత, కుమారుడు నాగార్జునను బాగా చూసుకోవాలని కోరాడు. అప్పటి నుంచి శివప్రకాశ్ వీరి కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఇది నచ్చని కుమారుడు సాగర్ పలుమార్లు తండ్రిని హెచ్చరించాడు. తండ్రి పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి సాగర్ తన తండ్రి వద్దకు వచ్చాడు.
ఈ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగ్రహంతో సాగర్ తండ్రి శివప్రకాశ్ (56)ను అతనితో ఉన్న మహిళ లత (48)ను దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోడానికి వచ్చిన లత కుమారుడు నాగార్జునపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.