బాబూ దమ్ముందా ? ఈ నెల 24న బంద్

YS Jagan called for AP bandh on july 24

ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికలకి ప్రధాన ఆయుధంగా మార్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం కేంద్రం మీద అవిశ్వాసం పెట్టి దేశం మొత్తం ఏపీ మీద ద్రుష్టి పడేలా చేస్తే ఇప్పుడు వైసీపీ ప్రత్యేక హోదా సెంటిమెంట్ ని ఏపీలో రగల్చాలని చూస్తోంది. ఈరోజు ఉదయం కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్రజలను చంద్రబాబు సర్కారు మోసం చేస్తున్న కారణంగా, మంగళవారం, 24వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఎక్కడికక్కడ బస్సులను, రహదారులను దిగ్బంధించాలని, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, తన ఎంపీలతో రాజీనామా చేయించేంత వరకూ తమ పార్టీ నిరసన కార్యక్రమాలు జరుపుతూనే ఉంటుందని అన్నారు.

టీడీపీ ఎంపీలను రాజీనామాలు చేయాలని ప్రజలు ఒత్తిడి తేవాలని కోరారు. ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. తమ పార్టీ ఎంపీలను రాజీనామాలు చేయించి గెలిపించుకొనే ధైర్యం ఉందా అని జగన్ బాబును ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేసి వస్తే, అందరమూ కలసి నిరాహార దీక్షకు కూర్చుని కేంద్రాన్ని కదిలిద్దామని, కిందకు దిగివచ్చి, రాష్ట్రానికి హోదాను ప్రకటించేలా చూద్దామని తెలిపారు. హోదా రావాలంటే, అంతకుమించిన మార్గం లేదని అన్నారు. బంద్ ను విజయవంతం చేస్తే, ఏపీ ప్రజలు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు వెళతాయని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఉన్న సెంటిమెంట్ ను మిగిలిన పార్టీలకు కూడా తెలియజెపుదామని, ఆ స్థాయిలో బంద్ ను జరుపుదామని అన్నారు.