Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల అమలు కోసం..కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 20న నిరాహారదీక్ష చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించంపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. విజయవాడలో పాదయాత్ర చేస్తున్న జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నిరాహార దీక్షకు తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీని చంద్రబాబు ఎంపికచేసుకోవడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 20కి కొత్త భాష్యం చెప్పారు. నెలలో ఏప్రిల్ అంకెను, చంద్రబాబు పుట్టినరోజు సంఖ్యను కలుపుతూ అర్ధరహిత విమర్శ గుప్పించారు. చంద్రబాబు తన పుట్టినరోజున దీక్ష చేస్తానన్నారని, ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 20 అని… అంటే నాలుగో నెలలో 20 వతేదీన… అంటే 420 అని… ఆయన కొంగజపం చేస్తారని జగన్ వ్యంగాస్త్రాలు విసిరారు.
చంద్రబాబు తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి, ఆమరణదీక్షకు దిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని, అవి చేయకుండా ఏప్రిల్ 20న ఈ 420 మనిషి దీక్ష చేస్తారట అని జగన్ ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి విజయవాడలోనే ఉంటారని, కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోరని, అభివృద్ధి చేయరు కానీ అవినీతి మాత్రం చేస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో ఒక్క ఫ్లై ఓవర్ కూడా కట్టలేకపోతున్న చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని కడతానని అంటున్నారని, చంద్రబాబు చెబుతోన్న అసత్యాలకు అదుపులేకుండా పోతోందని మండిపడ్డారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గం కోసం 19 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం మూడేళ్లలోనే పూర్తిచేశారని, చంద్రబాబు కనీసం ఒక్క ఫ్లై ఓవర్ కట్టలేరు కానీ, అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు జపాన్ వెళ్లి, బుల్లెట్ ట్రైన్ వస్తుందంటారని, అమెరికా వెళ్లి వచ్చి మైక్రోసాఫ్ట్ ను తీసుకొస్తున్నానని చెబుతారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే… రాజధానికి వ్యతిరేకమని ఎదురుదాడికి దిగుతారని మండిపడ్డారు. టీడీపీ నేత జలీల్ ఖాన్ పైనా జగన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఇక్కడి ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్ చదివాడట..అని జలీల్ ఖాన్ ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేశారు.