Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన జరిగి ఇంతకాలం అయినా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కార్యాలయమే ఏర్పాటు కాలేదని వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాన్నాళ్లు వాటిని జగన్ పట్టించుకోలేదు. అయితే పార్టీ శ్రేణులు, నాయకులు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా అందరూ ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు విజయవాడలో పార్టీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. వేచి చూసి చూసి ఏర్పాటు చేసిన ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా జగన్ రాలేదు. పార్టీ సీనియర్స్ ఆ తంతు దగ్గరుండి పూర్తి చేశారు. అయితే జగన్ ఆ తర్వాత బీసీ సమావేశం కోసం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇకపై ఆయన విజయవాడ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వైసీపీ శ్రేణులు కూడా భావించాయి.
పార్టీ బీసీ సమావేశం పూర్తి అయ్యాక మళ్ళీ జగన్ ఎప్పుడు అందుబాటులో వుంటారు అని నేతలు, కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నకి కార్యాలయ సిబ్బంది దగ్గర కచ్చితమైన సమాధానమే లేదట. దీంతో జగన్ ఎప్పుడు వచ్చేది వారికి కూడా తెలియదని అర్ధం అయిపోయింది. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటైనా హైదరాబాద్ లోనే జగన్ ఎక్కువగా వుంటున్నారు. పైగా ఆయనకి విజయవాడ లో ఉండటం కూడా పెద్ద ఇద్టపడటం లేదట. దీని వెనుక వున్న కారణాలు ఏమిటో బయటికి రాకపోయినా జగన్ విజయవాడ కార్యాలయంలో గెస్ట్ రోల్ కి మాత్రమే పరిమితం అయ్యేట్టు కనిపిస్తోంది.