Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వయసుకు చిన్నవాడైనా ప్రతిభకు కాదు. మహామహులు కొలువుదీరిన లోక్ సభలో రామ్మోహన్ ప్రసంగాలు, ప్రశ్నలు మిగిలిన సభ్యుల ప్రశంసలు చూరగొంటున్నాయి. అందుకే ఆయన్ని ఉత్తరాంధ్రలో తిరుగులేని అస్త్రంగా వాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ టీం లో కూడా రామ్మోహన్ కి ప్రత్యేక గుర్తింపు వుంది . ఇటు వైసీపీ కూడా రామ్మోహన్ ని ఎదుర్కోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. రామ్మోహన్ నాయుడుని ఓడించకపోతే ఆ ప్రభావం శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పడుతుందని జగన్ కి అర్ధం అయ్యింది. అందుకే రామ్మోహన్ మీద పోటీకి ఈసారి గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆయన అనుకుంటున్నారు. కిందటిసారి రామ్మోహన్ మీద పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి శాంతి కి ఇప్పటికే పాతపట్నం అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు.
2019 ఎన్నికల్లో రామ్మోహన్ ని దీటుగా ఎదుర్కోగలిగే నాయకుడు కోసం వైసీపీ అధినేత జగన్ ఎంతగానో అన్వేషించినా ఎక్కడా ఆ స్థాయిలో కొత్త వ్యక్తిని పట్టుకోలేకపోయారు. అందుకే జిల్లా పార్టీలో సీనియర్ లైన ధర్మాన సోదరుల్లో ఎవరో ఒకరిని లోక్ సభకు పోటీ చేయిద్దామని జగన్ అనుకున్నారట. ఇదే మాట ఆ అన్నదమ్ములతో అన్నప్పుడు మాకు లోక్ సభకు పోటీ చేసే ఉద్దేశం లేదని, అసెంబ్లీ బరిలో నిలుస్తామని చెప్పారట. ధర్మాన ప్రసాదరావు అయితే తన సన్నిహితులతో ఇదే విషయాన్ని చెబుతూ రామ్మోహన్ తో పోటీ తెలిసీతెలిసి ఓటమికి ఎదురు వెళుతున్నట్టే అని చెప్పారంట. ఇక కృష్ణదాస్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారంట. ధర్మాన సోదరులు కాదు అని చెప్పాక జగన్ దృష్టి మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం మీద పడిందట. ఆముదాలవలస నుంచి వరసగా ఓడిపోతున్న తమ్మినేని కూడా రామ్మోహన్ తో పోటీ అనగానే భయపడిపోయారంట. అయితే కులాల సమీకరణాల ప్రకారం సీతారాం అభ్యర్థి అయితే గెలుపు మాట ఎలా వున్నా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుందని జగన్ అనుకుంటున్నారట. ఈ విషయంలో సీతారాం ని పోటీకి ఎలాగైనా ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారంట.