Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయం ఒక రాష్ట్రంలో…నివాసం, పార్టీ కార్యాలయం ఇంకో రాష్ట్రంలో …మూడేళ్ళుగా వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ, ఆరోపణ కూడా. మిగిలిన రాజకీయ విమర్శలకి వైసీపీ దగ్గర సమాధానం ఉందేమో గానీ ఈ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఆ పార్టీ నేతలు సైలెంట్ అయిపొయ్యేవారు. ఇన్నాళ్ళకి వాళ్ళ బాధ తప్పే వార్త ఒకటి బయటికి వచ్చింది. వైసీపీ వ్యవహారాలు త్వరలో హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి బెజవాడ, బందర్ రోడ్ సమీపంలోని, pwd గ్రౌండ్స్ వద్ద కి షిఫ్ట్ కాబోతున్నాయి. ఇక్కడే వైసీపీ తాత్కాలిక ఆఫీస్ భవనం రెడీ అవుతోంది. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొలుసు పార్థసారథి కి చెందిన స్థలంలో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. మొత్తం 6 వేల చదరపు అడుగుల్లో వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు.
కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనంలో వైసీపీ అధినేత జగన్ కోసం ప్రత్యేకంగా ఓ ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వుండే సీనియర్ నాయకుల కోసం కొన్ని గదులు కేటాయిస్తున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుకోడానికి వీలుగా ఓ పెద్ద సమావేశ మందిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతో ఇంటరాక్ట్ కావడానికి వీలుగా వీడియో కాన్ఫరెన్స్ కోసం కూడా సర్వ సన్నాహాలు చేశారు. ఇక పార్టీ కార్యాలయానికి తరలివచ్చే కార్యకర్తల కోసం కూడా ఓ వెయిటింగ్ హాల్ వుంది. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్న ఈ భవనం నుంచి జగన్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. ఒకటిరెండు వారాల్లో ఈ భవన నిర్మాణం పనులు పూర్తి అవుతాయట. ఆపై ఓ మంచి ముహూర్తాన జగన్ హైదరాబాద్ నుంచి బెజవాడ వచ్చేస్తారు.
వైసీపీ వ్యవహారాలు ఈ కొత్త భవనంలో కూడా కొన్నాళ్ల పాటే జరుగుతాయి. ఇది కూడా వైసీపీ కి తాత్కాలిక మజిలీయేనట. మున్ముందు మంగళగిరి సమీపంలో పార్టీ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఇప్పటికే స్థలం ఎంపిక పూర్తి అయ్యిందట. అక్కడ కూడా భవన నిర్మాణం జరిగాక ఓ శుభముహూర్తాన బెజవాడ నుంచి మంగళగిరికి వచ్చేస్తారు జగన్. మాములుగా అయితే ఆ మార్పు కూడా 2019 ఎన్నికల ముందే జరగాలని భావిస్తున్నారు . కానీ లోటస్ పాండ్ వదిలి బెజవాడ రావడానికే ఇంత టైం పడితే ఇక మంగళగిరి రావడానికి ఇంకెంత టైం పడుతుందో అని పార్టీ నాయకులే కామెంట్ చేస్తున్నారు.