Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన. ఆంధ్రాలోని 175 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతేకాక బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11న ఏపీలో తన పర్యటన వివరాల షెడ్యూల్ విడుదల చేస్తానని చెప్పిన ఆయన… తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న వివరాల్ని ఆగస్టులో ప్రకటించనున్నట్టు తెలిపారు. నిన్న ఏపీలోని 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కీలక నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి దేవ్ ని పరిచయం చేశారు. ఆయన పవన్ కు వ్యూహకర్తగా ఉండనున్నట్లుగా వెల్లడించారు. తాను స్టార్ట్ చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుంచి దేవ్ తో తనకు అనుబంధం ఉందన్నారు.
ఇక్కడి దాకా బాగానే ఉన్నా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్ని స్థానాల్లో పోటీకి దిగబోతున్నామనేది ప్రకటిస్తానని పవన్ కొద్ది నెలల క్రితం చెప్పారు. అంతవరకూ ప్రజల్లో ఉండి, తమ బలమెంతో ఒక అంచనాకు వచ్చిన తరువాత, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలం కాబట్టి డిసెంబర్ వరకు ఆగాలి అంటూ అప్పుడన్నారు అయితే ఆర్నెల్ల ముందే 175 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారంటే జనసేన బలంపై వారికి వచ్చిన అంచనా ఏంటో జనసేన వర్గాలకే తెలియాలి. ఇక, అన్ని స్థానాల్లో జనసేన పోటీ అంటే ఇప్పటి దాకా వచ్చిన జగన్-పవన్ ల పొత్తు, లేదా బీజేపీ-వైసీపీ-జనసేన ల పొత్తు ఇక లేనట్టుగా సంకేతాలు ఇచ్చినట్టే భావించాలి. పవన్ తాను ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు అర్థం అవుతోంది. అలా అయితే, రాష్ట్ర అధికార ప్రతిపక్షాలలో ఎవరికీ ఎక్కువ నష్టం అనే లెక్కలు వేస్తే అవి జగన్ కే ఎక్కువ నష్టం అని తెల్చేస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పటి వరకు జనసేనతో పొత్తు ఉంటుందేమో అన్న భ్రమలో పవన్ ని కానీ, జనసేన ని కానీ పల్లెత్తు మాట అనకుండా జగన్ జాగ్రత్త పడ్డాడు. మొన్నటిదాకా ఏపీలో తెలుగుదేశం, వైసీపీల మధ్యే పోటీ ఉండగా, ఇప్పుడు జనసేన కూడా మూడో కుంపటి పెట్టుకోవడం జగన్ కి కొత్త తంటా తెచ్చినట్టు అయ్యింది. మొన్నటి దాకా టీడీపీకి ఏజెంట్ గా పవన్ పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనే చంద్రబాబుతోనే జనసేన కలిసి పోటీ చేస్తుందని వైసీపీ చేసిన ప్రచారానికి కొద్ది రోజుల క్రితమే పవన్ క్లారిటీ ఇచ్చేసాడు. గత ఎన్నికల్లోనే బీజేపీ-టీడీపీ కూటమితో కలిసి తప్పు చేశానని, ఇకపై వచ్చే ఎన్నికల్లో ఆ తప్పు చేయదలుచుకోలేదని అన్నాడు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎన్డీయే మోసం చేసిందని చెప్పిన పవన్, ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీతో కలిసి పోరాటం చేసేందుకు సిద్దమని తెలిపాడు.
ఇక ఆ మాట తో సైలెంట్ అయిపోయిన వైసీపీ పవన్ ని ఒక మాట అనడం అటుంచి రోజా లాంటి వారి చేత వెనకేసుకు రావడం ప్రారంభించింది. అయితే ఇపుడు పవన్ తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో వైసీపీ ఇప్పుడు డైలమాలో పడిపోయింది. ఇన్నాళ్ళూ పవన్ ని వెనకేసుకువచ్చిన తాము ఇప్పుడు ముక్కోణపు పోటీ రావడంతో పవన్ ని ఏమని విమర్శించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఒకప్పుడు పవన్ పోటీ చేస్తే టీడీపీ వోట్లకే నష్టం వస్తుందని అని భావించారు కానీ ఇప్పటిదాకా జగన్ చూపిన వ్యూహాత్మక మౌనం ఆ వోట్లు జగన్ పార్టీ నుండి చీలేలా చేస్తున్నాయి. చూడాలి ఈ ముక్కోణపు పోటీ ఎవరిని రాజుని చేస్తుందో.