Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొత్తొక వింత పాతొక రోత అనేది నానుడి. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ విషయంలో రివర్స్ లోనే వెళుతున్నారు. ఆయనకు కొత్త కన్నా పాత అంటేనే మోజులా కనిపిస్తోంది. ఈ మధ్యే వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించారు. ఆ రోజు పూజలకు రాకపోయినా తర్వాత అక్కడ బీసీ పార్టీ సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. ఇకపై ఆయన అక్కడ నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారని అనుకున్నారు. కానీ వాస్తవం వేరులా వుంది. పాదయాత్ర కి ముందు పార్టీ మైనారిటీ,బీసీ, ఎస్సీ విభాగాలతో పాటు ముఖ్య నాయకులతో విడివిడిగా భేటీ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. పైగా పాదయాత్ర కి ముందు జరిపే సమావేశాలు కావడంతో వీటికి ఎంతో ప్రాధాన్యం వుంది. ఈ సమావేశాలు విజయవాడలోని కొత్త పార్టీ కార్యాలయం లో జరుగుతాయని అనుకున్నా ఆలా జరగడం లేదు. ఈ సమావేశాల్లో కొన్ని హైదరాబాద్ లోని లోటస్ పాండ్ , మరికొన్ని దాని దగ్గరలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులకు సందేశాలు వెళ్లాయి. ఆ సందేశం చూసిన పార్టీ నేతలు, కార్యకర్తలు కొత్త ఆఫీస్ వదిలేసి పాత కార్యాలయం మీద, హైదరాబాద్ మీద ఈ మోజు ఏంటని గొణుక్కుంటున్నారు.