Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే క్షేత్ర స్థాయి పరిణామాలు పరిగణనలోకి తీసుకున్న ప్రశాంత్ కిషోర్ పార్టీ విజయం కోసం విలువైన ఓ సలహా ఇచ్చారట. అదే బీహార్ తరహాలో మహాకూటమి ఏర్పాటు. పవన్ నేతృత్వంలోని జనసేనతో కలిసి పనిచేస్తే టీడీపీ ని ఓడించడం తేలిక అవుతుందని, లేకుంటే విపక్ష ఓటు చీలి అధికార పార్టీ లాభపడుతుందని ప్రశాంత్ అభిప్రాయపడ్డారట. అయితే ఈ సలహా జగన్ కి పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. ఒకవేళ మహాకూటమి ఏర్పాటు చేస్తే జనసేన, వామపక్షాలకు కలిపి పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా సొంత బలంతో ప్రభుత్వ ఏర్పాటు కష్టం అవుతుంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే గెలిచినా పవన్ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. అంతా చేసినా కేంద్రంలో బీజేపీ సర్కార్ వస్తే తాను కేసుల నుంచి బయటపడటం కష్టమని జగన్ భావిస్తున్నాడు. అందుకే జగన్ ఓ కొత్త ఆలోచన చేస్తున్నాడట.
2019 ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుందని జగన్ ఆలోచన. ప్రశాంత్ చెప్పినట్టు మహాకూటమి కోసం అందరి దగ్గర సాగిలపడే బదులు ఒక్క బీజేపీ దగ్గర ఆ పని చేసి 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 15 ఎంపీ సీట్లు, 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించడానికి రెడీ అవుతున్నారట జగన్. ఇదే విషయాన్ని ఇప్పటికే విజయసాయి ద్వారా బీజేపీ అధినాయకత్వానికి చేరవేశారట. బీజేపీ పొత్తు కుదిరితే 2019 ఎన్నికల్లో తాము ఓడిపోయినా కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే కేసుల నుంచి ఎంతోకొంత వెసులుబాటు ఉంటుందని జగన్ ఆలోచనగా ఉందట. నిజమే మరి… ఆంధ్రాలో బీజేపీ కి 70 అసెంబ్లీ సీట్లు ఇస్తే అధికారం సాధించడం అసాధ్యమని రాజకీయాలు పెద్దగా తెలియని వారికి కూడా అర్ధం అవుతుంటే, ఇక జగన్ కి అర్ధం కాదా ? అంటే కేసుల నుంచి బయటపడేందుకు ఓడిపోయినా పర్లేదని జగన్ అనుకుంటున్నారన్నమాట.