ఆ మధ్య హైకోర్టు విభజన నేపథ్యంలో సిబిఐ కోర్టులో నడుస్తున్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసమే హైకోర్టు విభజన జరిగిందని, ట్రయల్ పూర్తయిన జగన్ కేసులో మళ్లీ మొదటికి వస్తాయని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. జగన్ కేసుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ సమయంలో చర్చనీయాంసం అయ్యాయి. జగన్ ఆస్తుల కేసుల విచారణ సిబిఐ కోర్టులో జరుగుతోంది. ట్రయల్ కోర్టులో జరిగే విచారణలు ఆ కోర్టులోనే జరుగుతాయి తప్ప అప్పిలేట్ కోర్టులో జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ట్రయల్ కోర్టుకు, అపిలేట్ కోర్టుకు మధ్య తేడా తెలియక చంద్రబాబు అలా మాట్లాడుతున్నట్లు కూడా చాలా మంది గేలి చేశారు కానీ చంద్రబాబు అంచనాయే నిజమైంది. కేసుల విచారణను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు జగన్ తో కలిసి బీజేపీ కుట్ర చేసిందని ఇటీవల చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు భవనం పూర్తికాకుండా విభజనను పూర్తి చేశారని, హడావుడిగా కోర్టులను తరలించాల్సి వచ్చిందని కూడా ఆయన ఆరోపించారు. న్యాయమూర్తుల పంపకంలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసులను విచారిస్తున్న జస్టిస్ వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి విచారణ చేపట్టక తప్పనిసరి పరిస్థితి. ఇక, జగన్ పై ఉన్న కేసులను అమరావతికి తరలించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులు ఉమ్మడి రాష్ట్రంలో జరగడం, అటాచ్ అయిన జగన్ ఆస్తులు హైదరాబాద్ లోనే ఉండటం కారణంగా విచారణ నాంపల్లిలోని సీబీఐ కోర్టులోనే సాగాల్సివుందని చెబుతున్నారు.