ఫ్యాన్ స్పీడ్ కి పంచర్ అయిన సైకిల్

YS Jagan Public Meeting In Tirupathi

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎప్పుడో 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి అవుతున్నాయి. ఎవరు విజేతలో.. ఎవరు పరాజితులో అన్న ఉత్కంఠకు నేటితో తెరపడుతుంది. అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సంఘం పకడ్బంధీ ఏర్పాట్లు మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేశారు. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తారు. ఏపీ ఎన్నికల్లో ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. 87 స్థానాల్లో ఫ్యాన్ గాలి వీస్తుండగా 17 చోట్ల టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులు వైసీపీని అందుకోలేకపోయారు. టీడీపీకి చెందిన ప్రముఖులంతా వెనుకంజలోనే కొనసాగారు. తొలి రౌండ్‌లో ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చేతిలో 67 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో చంద్రబాబు నాయుడు వైసీపీ అభ్యర్ధి కంటే 1500 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.టీడీపీకి చెందిన ప్రముఖులు కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణ, నక్కా ఆనంద్ బాబు, గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. వైసీపీకి చెందిన అభ్యర్ధులు దాదాపుగా అన్ని స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. నెల్లూరు జిల్లాలోని 10 చోట్ల వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.