Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. 2019 నాటికి ఆ పార్టీ ఎదుర్కొనే సమస్యలు ఏమిటో చెప్పే విషయం ఇది. ప్రకాశం జిల్లా, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి భరత్. మాజీ ఎమ్మెల్యే నరసయ్య తనయుడు, కిందటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఈ యువనాయకుడిని సాక్షాత్తు అధినేత జగన్ బతిమాలుకోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే ఆలోచన లేదని చెప్పిన భరత్ ని పోటీకి ఒప్పించడానికి జగన్ నానా పాట్లు పడాల్సివచ్చింది. ముందుగా భరత్ తల్లి, సోదరితో మాట్లాడిన జగన్ భరత్ ని తనను కలిసేలా ఒప్పించగలిగారు. కుటుంబ బలవంతం మీద చిత్తూరు జిల్లా వెళ్లిన భరత్ అక్కడ పార్టీ అధినేతను కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి తన ఆర్ధిక బలం సరిపోదని వివరించినట్టు తెలుస్తోంది. నువ్వు పోటీకి రెడీ అంటే మిగిలిన విషయాలు నేను చూసుకుంటా అన్న జగన్ హామీతో ఆ ఎపిసోడ్ సుఖాంతమైంది. భరత్ కూడా పోటీకి సిద్ధమని చెప్పారు.
ఈ మాత్రం దానికి భరత్ ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారో, పోటీకి దూరం అని ఎందుకు చెప్పారో చాలా మందికి అర్ధం కావడం లేదు. అయితే ఓ వ్యూహం ప్రకారమే భరత్ ఇలా చేశారని, పార్టీ టికెట్ , ఖర్చు మీద జగన్ దగ్గర నుంచి స్పష్టమైన హామీ పొందడానికే ఈ ఎపిసోడ్ నడిపించారని పర్చూరులో జనం అనుకుంటున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా పార్టీ అధినేతనే కంగారు పెట్టించి, అనుకున్న హామీలన్నీ నెరవేర్చుకున్న భరత్ ని చూసి ఔరా నేటి తరం నాయకుడు అనుకుంటున్నారు. ఇక పోటీకి దూరం అన్న భరత్ మాటలు నిజం అని నమ్మి టికెట్ కోసం ట్రై చేసుకున్న ఓ ఇద్దరుముగ్గురు తమకే టికెట్ అని ప్రచారం చేసుకుని అభాసుపాలు అయ్యారు. ఈ ఎపిసోడ్ చూసాక రాజకీయం అంటే ఇలా కూడా ఉంటుందా అనిపించడం లేదు.