Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” అనే టైటిల్ తో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటించగానే ఎక్కడ లేని ఆసక్తి రేగింది. అయితే ఇంత వివాదాస్పదమైన సబ్జెక్టు మీద మాములు నిర్మాతలు సినిమా తీయడానికి ముందుకు వస్తారా అన్న డౌట్ చాలా మందిలో వుంది. ఎందుకంటే ఈ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూద్దాం అంటూ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఇప్పటికే వర్మకి సవాల్ విసురుతున్నారు. ఇలాంటి సవాల్ చేసిన టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఇంకో అడుగు ముందుకేసి ఎన్టీఆర్ మీద సినిమా తీయాలంటే చంద్రబాబు, బాలకృష్ణ అనుమతి తీసుకోవాలని కూడా సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ హెచ్చరికల్ని ఏ మాత్రం ఖాతరు చేయలేదు వర్మ. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు.
” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా నిర్మాణంలో నటుడు జేడీ చక్రవర్తి పాలుపంచుకుంటారని ఇంతకుముందు వార్తలు వచ్చినా వర్మ అందులో నిజం లేదని తేల్చేసాడు . తాజాగా సినిమా నిర్మాత ఎవరో కూడా వర్మ బయటికి చెప్పాడు. ఆయన పేరు పి. రాకేష్ రెడ్డి. ఇంతకుముందు సినీ రంగంలో ఈ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే రాకేష్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అంతలోనే తేలిపోయింది. ఈయనగారు వైసీపీ లో ఓ మోస్తరు లీడర్ అంట. చంద్రబాబు గురించి ఎప్పుడు విమర్శించాల్సి వచ్చినా నాటి వై.ఎస్ నుంచి నేటి జగన్ దాకా అంతా ఎన్టీఆర్ కి వెన్నుపోటు అనే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అది జరిగి 20 ఏళ్ళు దాటిపోయినా ఇప్పటికీ దాని చుట్టూనే విమర్శలు చేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా వర్మని అడ్డం పెట్టుకుని “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” పేరుతో సినిమా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు మీద సినిమా రావడం గురించి వైసీపీ ఎన్నో కలలు కంటోంది. ఈ సినిమాతో బాబు బండారం బయటపడి రాజకీయంగా దెబ్బ తింటారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. సినిమా తీయడం వీరికి కొత్త ఏమో గానీ ఇలా తెలుగు దేశాన్ని, ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాలు తీశారు. కానీ కృష్ణ డబ్బులు, ప్రతిష్ట పోవడం తప్ప ఎన్టీఆర్ కి కొత్తగా పోయిందేమీ లేదు. కాకుంటే పాత గాయాల్ని రేపడంలో వర్మ కాస్త సిద్ధహస్తుడు కాబట్టి కొన్నాళ్ల పాటు దీనిపై చర్చ జరగవచ్చు. అంతే తప్ప ప్రజాభిప్రాయాసాన్ని సినిమాలు నిర్దేశించే రోజులు కావు ఇవి.