ఐఐటీ స్టూడెంట్స్ వైసీపీ కోసం ఏమి చేస్తారు?

Prashant Kishor IIT students Team do survey on AP politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 లో బీజేపీ తరపున సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఆపై కమలనాథులకు దూరం అయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయి ఎన్నికల వ్యూహకర్తగా అవతారం ఎత్తారు. మహాకూటమి ఆవిర్భావానికి బాటలు వేసి ఆ గెలుపు క్రెడిట్ లో సింహ భాగం తీసుకున్నారు. ఆపై యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పొత్తుల ప్రయోగం చేసి విఫలం అయ్యారు. ప్రశాంత్ చెప్పినట్టు కాంగ్రెస్, సమాజ్ వాదీ కలిసి పని చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ ఫెయిల్యూర్ వెనుక ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్, ప్రశాంత్ కిషోర్ మీద అపార నమ్మకంతో ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నాడు. పార్టీ సమావేశంలో తన పక్కనే కుర్చీ వేసి రానున్న రోజుల్లో ప్రశాంత్ కి పార్టీ లో ఇస్తున్న విలువ ఏమిటో చాటి చెప్పాడు.

ప్రశాంత్ కిషోర్ సైతం వైసీపీ అధినేత జగన్ ఇస్తున్న గౌరవాన్ని బాగా ఆస్వాదిస్తున్నాడు. అదే ఊపుతో కిందటి ఎన్నికల్లో రాజకీయంగా చేసిన తప్పులే వైసీపీ ఓటమికి దారి తీశాయని చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు గట్టిగా కష్టపడి 10 కి 10 మార్కులు తెచ్చుకోవాలని ప్రశాంత్ వైసీపీ నేతలకు సూచన చేశారు. పైగా ఇప్పటికే ఐఐటీ విద్యార్థులు పార్టీ కోసం బూత్ స్థాయిలో సర్వే చేస్తున్నారని ఆర్భాటంగా ప్రకటించారు. ఆయనే కాదు చాలా మంది రాజకీయ నేతలు, సామాన్యులు కూడా ఐఐటీ విద్యార్థులు ఏదో అద్భుతం చేస్తారని నమ్ముతారు. ఇక ఇంగ్లీష్ బాగా మాట్లాడే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తమని గెలుపు తీరాలకు చేరుస్తారని నాయకులు, పార్టీలు కూడా నమ్ముతున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరు. అక్కడ ఐఐటీ విద్యార్థులు అయినా హార్వర్డ్ ఎంబీఏ అయినా చేసేది ఏమీ ఉండదు. సర్వే చేసే విధానంలో మార్పులు రాకుండా కేవలం సర్వే లో పాల్గొనే వాళ్ళని మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండబోదు.

ప్రస్తుతం ప్రశాంత్ టీం అనుసరిస్తున్న సర్వే విధానం సెఫాలజిస్ట్ లు ఎప్పటి నుంచో అనుసరిస్తున్నదే. కాకుంటే ఆ సర్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడానికి కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. అది కూడా సాఫ్ట్ వేర్ వల్ల కలిగిన సౌలభ్యం మాత్రమే. నిజానికి పాశ్చాత్య దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతినే ఇక్కడ కూడా సమాచార సేకరణ లో వినియోగిస్తున్నారు. కానీ ఇక్కడ సమాజంలో సంక్లిష్టత ఎక్కువ. వేలకొద్దీ కులాలు, వందల కొద్దీ భాషలు, ప్రాంతాన్ని బట్టి సంస్కృతులు… ఇంత సంక్లిష్ట సమాజం వున్న గ్రామాల్లోకి, పట్టణాల్లోకి కేవలం 1,2 శాతం శాంపిల్ తీయడానికి ఐఐటీ స్టూడెంట్ వెళ్లినా మాములు విద్యార్థి వెళ్లినా ఒక్కటే. పల్లెల్లో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడానికి స్థానికుల మీద ఆధారపడితే మేలు గానీ ఒకటిరెండు పూటలు వచ్చి వెళ్లే వారి తో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సదరు గ్రామ సామాజిక పరిస్థితి, స్థూల రాజకీయ పరిస్థితి కొత్తగా వచ్చిన వారికి అర్ధం కావడం ఒకటిరెండు రోజుల్లో అయ్యే పని కాదు. ఆ గ్రామాల్లో పుట్టి పెరిగిన వారైనా ప్రత్యేక దృష్టి పెట్టందే రాజకీయ సారాన్ని ఒంటబట్టించుకోవడం అంత తేలిగ్గాదు. సర్వే విధానాల్లో మార్పు లేకుండా ఐఐటీ విద్యార్థుల్ని దించినందువల్ల ఏ ప్రయోజనం ఉండదు.

  మరిన్ని వార్తలు 

ఇజ్రాయెల్ లో మర్యాద.. మర్యాద

200 నోట్లు అక్కడ దొరకవు