అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన మావోయిస్టులు మరికొందరిపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అరకు, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ జరుగుతున్నా పట్టని ముగ్గురు మావోయిస్టులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరకులోయకు నాలుగు కిలోమీటర్ల దూరానున్న బెంజిపూర్‌కు వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కనున్న బస్‌షెల్టర్ వద్ద ఒక యువకుడు నిల్చొని వుండగా, ఆ ముగ్గురూ వెళ్లి అరకు టీడీపీ ఎంపీపీ అరుణ కుమారి భర్త అప్పాలు ఇల్లు ఎక్కడో తెలుసా అని ప్రశ్నించారు.
వారి చేతిలో వాటర్ బాటిల్, వీపునకు బ్యాగులు, చేతిలో ఆయుధాలు వంటివి వుండడంతో భయపడిన ఆ యువకుడు తనకు ఇక్కడ ఎవరూ తెలియదని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఊళ్లోకి వెళ్లి ఎంపీపీ అరుణకుమారికి, ఆమె భర్త అప్పాలుకు విషయం తెలియజేశాడు. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు వున్నారని మిమ్మల్ని చంపేందుకే వచ్చి ఉంటారని హెచ్చరించాడు. దీంతో భయపడిన ఎంపీపీ అరుణకుమారి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. దీనికి స్పందించిన అరకు సీఐ, ఏఎస్పీ హుటాహుటిన బెంజిపూర్‌లోని ఎంపీపీ ఇంటికి వెళ్లారు. జరిగిందేమిటో తెలుసుకొని, ఆమె భర్త అప్పాలును, విషయం అందజేసిన యువకుడిని అరకు తీసుకువెళ్లారని తెలుస్తోంది.