హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు . ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడా లేదన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం మన రాష్ట్రంలోనే చెప్పట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్య నగరంలో ఒక్కొక్కరికి 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నామన్నారు.
లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ 9100 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో నిర్మాణం చేస్తున్నామన్నారు . ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు అని.. కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుందన్నారు.