తెలుగు చిత్రసీమలో పోలీస్ ఇతివృత్తాలంటే తొలుత గుర్తొచ్చే పేరు హీరో రాజశేఖర్‌దే. పోలీస్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొంటూ వచ్చిన ఆయన గరుడవేగతో తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ నేపథ్యాన్ని ఎంచుకొని రాజశేఖర్ నటించిన చిత్రం కల్కి. అ! సినిమా ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న ప్రశాంత్‌వర్మ ద్వితీయ ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రమిది. హ్యాపీ మూవీస్ పతాకంపై నిర్మాత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి.
కొల్లపూర్ రాజు బాలకిషన్ రావు మరణంతో ఈ సంస్థానాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు సేనాని నర్సప్ప(అశుతోష్‌రాణా). మంత్రి కొడుకు పెరుమాండ్లు (శత్రు)సహాయంతో మహారాణి రామచంద్రమ్మతో పాటు ఆమె కుమారుడిని హతమారుస్తాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా కొల్లాపూర్‌కు శాసనసభ్యుడిగా ఎన్నికవుతూ ఎదురుతిరిగిన వారిని అంతం చేస్తుంటాడు నర్సప్ప. నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను శత్రువులు హత్య చేస్తారు. తనపై ఉన్న అక్కసుతోనే పెరుమాండ్లు ఈ హత్య చేశాడని నర్సప్ప వర్గం భావిస్తుంటుంది. దాంతో కొల్లాపూర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలగటంతో ప్రభుత్వం ఆ కేసును నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి కల్కి(రాజశేఖర్)కి అప్పగిస్తుంది. శేఖర్‌బాబును హత్య చేసిన దెవరో తెలుసుకోవడానికి కల్కి సాగించిన అన్వేషణలో నర్సప్ప, పెరుమాండ్లు కలిసి చేసిన ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తాయి. నర్సప్ప, పెరుమాండ్లును కల్కి ఎలా శిక్షించాడు? వృత్తి నిర్వహణలో కల్కికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?అపోహల కారణంగా కల్కికి దూరమైన ప్రియురాలు పద్మ(అదాశర్మ) అతడి మంచితనాన్ని ఎలా గ్రహించింది? కొల్లాపూర్ సంస్థానంలో కల్కికి ఉన్న సంబంధం ఏమిటన్నదే మిగతా కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథలు దర్శకుడు రాసుకునే మలుపులపై ఆధారపడి సాగుతాయి. తర్వాత ఏం జరుగుతుందోననే అంశాన్ని ప్రేక్షకుడి ఊహలకు అందకుండా నడిపించడంపైనే ఈ సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కల్కి అలాంటి కథే. కథలో కొత్తదనం లేకపోయినా కథనాన్ని మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. ఓ హత్యానేరానికి 1980 కాలం నాటి తెలంగాణ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి తన కుటుంబానికి హాని చేసిన వారిపై వృత్తి నిర్వహణలోనే భాగంగానే ఓ పోలీస్ ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ ఆకట్టుకుంటుంది. పరిచయఘట్టాల పేరుతో కాలక్షేపం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిన దర్శకుడు ఎక్కడ బ్రేకులు లేకుండా సినిమాను స్పీడుగా ముందుకు నడిపించారు.
శేఖర్‌బాబు హత్యచేసిన వారిని పట్టుకోవడానికి కల్కి సాగించే అన్వేషణ ఆద్యంతం ఉత్కంఠను పెంచుతుంది. హంతకుడు కంటి ముందు కనిపిస్తున్నా ఎవరో చంపారో తెలియని అయోమయం నుంచి ఒక్కో చిక్కుముడిని విప్పతూ కథను కంచికి చేర్చిన తీరు కొత్తగా ఉంటుంది. పోలీస్ కథలోనే అంతర్లీనంగా కుటుంబ ప్రతీకారాన్ని, ప్రేమకథను సమ్మిళితం చేసిన తీరు బాగుంది. 1980ల కాలం నాటి తెలంగాణ నేపథ్యాన్ని, యాస, భాషలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. లాజిక్‌లు మిస్ కాకుండా వాటిని జాగ్రత్తగా తెరపై చూపించాలనే దర్శకుడి తాపత్రయం ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. పతాక ఘట్టాల్లోని మలుపులు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
అ! తొలి అడుగులోనేకొత్త తరహా ప్రయోగం చేసిన ప్రశాంత్ వర్మ కల్కితో రొటీన్ బాటను అనుసరించారు. పోలీస్ కథలతో ఇదివరకు తెలుగులో వచ్చిన అనేక సినిమాల బాటలోనే ఇది సాగింది. నేరస్తుడి కోసం హీరో సాగించే ఇన్వేస్టిగేషన్‌లో కొన్ని సన్నివేశాలు సాగతీసిన అనుభూతి కలుగుతుంది. రాజమహాల్ ఎపిసోడ్‌తో పాటు మరికొన్ని సంబంధం లేని మలుపుల కథను పక్కదారి పట్టించాయి. అలాగే యాక్షన్ ఘట్టాలను రొమాంచితంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో హద్దులు దాటారు. బుల్లెట్‌ను గొడ్డలితో తిప్పికొట్టడం, గొడుగుతోనే పదుల సంఖ్యలో శత్రువుల్ని మట్టికరిపించడం లాంటి సన్నివేశాలు లాజిక్‌లకు దూరంగా సాగాయి.
పోలీస్ పాత్రల్లో అలవోకగా ఒదిగిపోతారు రాజశేఖర్. ఇందులో కల్కిగా ఆయన అభినయం, మేనరిజమ్స్ కొత్తగా ఉన్నాయి. రాజశేఖర్ ఇమేజ్, హీరోయిజాన్ని నమ్మి తెరకెక్కించిన సినిమా ఇది. సీరియస్ సాగే ఈ పాత్రలో ఏమి సెప్తిరి అంటూ తనదైన శైలి ప్రాసలతో నవ్వించారు. నాజర్, జయప్రకాష్, అశుతోష్‌రాణా వంటి అనుభవజ్ఞులైన నటులు ఈ కథకు ప్రధాన బలంగా నిలిచారు. అదాశర్మ, నందితాశ్వేత పాత్రల్లో ఎలాంటి కొత్తదనం లేదు. దేవదత్త అనే అతి భయస్తుడైన క్రైమ్ రిపోర్టర్‌గా రాహుల్ రామకృష్ణ తెలంగాణ శైలి సంభాషణలతో అక్కడక్కడ నవ్వించారు.
శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కథను మరింత శక్తివంతంగా చెప్పడానికి దోహదం చేశాయి. దర్శకుడిగా ప్రశాంత్‌వర్మ ఈ సినిమాతో మరోసారి ప్రతిభను చాటుకున్నారు. ఆయన టేకింగ్, సన్నివేశాల్ని మలచిన తీరు బాగుంది.
పూర్తిగా రాజశేఖర్ అభిమానుల్ని మెప్పించే సినిమా ఇది. తెలుగు చిత్రసీమ కొత్త పంథాలో పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి రొటీన్ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచిచూడాల్సిందే..