ఓవైపు కరోనాతో సమాజం కొట్టుమిట్టాడుతుంది. అదే అదునుగా భావించిన ఓ వ్యక్తి కరోనా మహమ్మారి పేరుతో ఘోరానికి ఒడిగట్టాడు. తమ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భర్త కరోనా కాలంలో ఏవిధంగానైనా పగ తీర్చుకోవాలని చూసిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
తాజాగా ఢిల్లీలో ఓ ఘటన చోటుచేసుకుంది. అదేమంటే.. తమ భార్యతో ఓ పోలీస్ హోమ్ గార్డ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్త అనుమానించాడు. దాంతో పగ పెంచుకున్నాడు. ఏలాగైనా సరే పగ తీర్చుకోవాలని రోజూ రగిలిపోతున్నాడు. హోమ్ గార్డ్ కుటుంబంపై పగ తీర్చుకోవాలని భావించిన భర్త.. కరోనా వైరస్ ను పావుగా ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు. అందుకోసం ఇద్దరు మహిళలను రంగంలోకి దింపి కరోనా వైద్య పరీక్షలు జరిపే సిబ్బందిగా పరిచయం చేసుకోమని హోమ్ గార్డ్ ఇంటికి పంపించాడు. ఆ ఇద్దరు మహిళలు వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది అని చెప్పారు. దాంతో వారిని నమ్మించిన ఆ మహిళలు… వెంట తెచ్చుకున్న చిన్న బాటిల్ ఇచ్చి కరోనా మందు అని చెప్పి వెళ్లారు.
అయితే నిజంగా కరోనా మందే అనుకొని ఆ ఇంట్లోని వాళ్ళు ఆ మందును తాగారు. దీంతో ఆ కుటుంబమంతా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే వారిని స్థానికులు గుర్తించి హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో విషం తీసుకున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఇద్దరు మహిళలను గుర్తించారు. వారిని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంతటికీ కారణమైన సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.