హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారంట్ లో కుక్క మాంసం ఘటన మరువకముందే, మరోసారి కుక్కమాంసం ఈసారి చెన్నై లో కలకలం రేపుతోంది. చెన్నై నగరంలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఐదో నెంబర్ ప్లాటుఫారం పైన 1000 కేజీల మాంసాన్ని రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కి చెందిన పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేకమైన చెక్కపెట్టల్లో ప్యాకింగ్ చేసున్న ఈ మాంసం జోధ్‌పూర్ నుండి వచ్చిన ఎక్సప్రెస్ రైలుబోగీ నుండి ఐదవ నెంబర్ ప్లాటుఫారం పైన దించి, తరలించడానికి సిద్ధంగా ఉండగా రైల్వే అధికారులు గుర్తించారని తెలిపారు. ఇలా స్వాధీనం చేసుకున్న మాంసాన్ని కుక్కమాంసం గా పరిగణించి, ప్రాథమిక దర్యాప్తు కోసం మాంసం శాంపిళ్లను పరీక్షలకోసం వెటర్నరీ కాలేజీకి సోమవారం అనగా ఈనెల నవంబర్ 19 న పంపబోతున్నట్లు తెలిపారు.
ప్రతిరోజూ చెన్నై లో ఉన్న రెస్టారెంట్లలోకి వివిధ నగరాల నుండి మాంసం సరఫరా అవుతుంటుంది. అలాగే కుక్కమాంసంగా అనుమానిస్తున్న ఈ వెయ్యి కేజీల మాంసం డబ్బాలని తరలిస్తున్నారనిఅభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రిపోర్టు లో ఈ మాంసం కుక్కమాంసం గా తెలిస్తే, చర్యలు చేపట్టి ఎక్కడినుండి ఈ మాంసం వచ్చిందో, ఏ ఏ రెస్టారెంట్లకు తరలించబడుతుందో దర్యాప్తులో తేలుస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వార్తతో చెన్నై లో స్థానికంగా బయటి రెస్టారెంట్లలో రోజూ భోజనం చేసే స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.