ఎన్టీఆర్ రాజ‌ధానిని వీక్షిస్తున్న‌ట్టుగా…

108 Feet NTR Statue on Neerukonda Hill at Neerukonda of amaravati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

న‌వ్యాంధ్ర రాజ‌ధానిని 108 అడుగుల ఎత్తులో నిల్చుని తెలుగువారి ఆరాధ్య‌దైవం ఎన్టీఆర్ తిల‌కించనున్నారు. అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ విగ్ర‌హం కొలువుతీరనుంది. నీరుకొండ కొండ‌పై అతిపెద్ద ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన నాలుగు ఆకృతుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప‌రిశీలించారు. ఆకృతుల‌కు మ‌రింత మెరుగులు దిద్ది వ‌చ్చే మంత్రివ‌ర్గం నాటికి సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. తొలుత కృష్టాన‌ది ఒడ్డున కోర్ క్యాపిట‌ల్ కు అభిముఖంగా ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయాల‌నుకున్నారు. త‌ర్వాత నీరుకొండ కొండ‌పై ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించారు. కొండ‌పైనుంచి రాజ‌ధాని వైపు చూసేలా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయనున్నారు. విగ్ర‌హం ఎదుట భారీ జ‌లాశ‌యం ఉంటుంది. కొండ‌పై ఎన్టీఆర్ స్మార‌క‌కేంద్రం, క‌న్వెన్ష‌న్ కేంద్రాలు, గ్రంథాల‌యం, ఎన్టీఆర్ జీవిత విశేషాల‌తో కూడిన ప్ర‌ద‌ర్శ‌న శాల ఉంటాయి.

ముఖ్య‌మంత్రి ప‌రిశీలించిన నాలుగు ఆకృతుల్లో ఒక‌టి స్వాతిముత్యం ఆకారం. విగ్ర‌హం కింద ఉండే పీఠం స్వాతిముత్యం ఆకారంలో 24 మీట‌ర్ల ఎత్తు ఉంటుంది. దానిపై విగ్ర‌హం ఏర్పాటుచేస్తారు. రెండో ఆకృతి..ముత్య‌పు చిప్ప ఆకృతి. ఈ ఆకృతిలో విగ్ర‌హం కింద ఉండే పీఠం ముత్య‌పు చిప్ప ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ పీఠం ఎత్తు కూడా 24 మీట‌ర్లే. మ‌రో ఆకృతి ప‌రిక్ర‌మ ఆకృతి. సంద‌ర్శ‌కులు కొండ చుట్టూ తిరిగి పైకి చేరుకునేలా ఈ ఆకృతి ఉంటుంది. కొండ‌శిఖ‌రంపై ఎన్టీఆర్ విగ్ర‌హం ఉంటుంది. పీఠం ఎత్తు 35 మీట‌ర్లు. చుట్టూ ప‌చ్చ‌ద‌నం ఉంటుంది. నిర్మిత ప్రాంతం 70వేల చ‌ద‌ర‌పు అడుగులు. మ‌రో ఆకృతి క‌మ‌లం ఆకారం. విగ్ర‌హం కింద ఉండే పీఠం క‌మ‌లం ఆకృతిలో ఉంటుంది. దానిపైన విగ్ర‌హాన్ని ఏర్పాటుచేస్తారు.