Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు మరోమారు చుక్కెదురయింది. కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దుమ్కా ట్రెజరీ కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ గత సోమవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 14 ఏళ్ల జైలుతో పాటు..రూ. 60లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. దుమ్కా కోశాగారం నుంచి 3.13 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసినట్టు ఆరోపణలు రావడంతో లాలూతో పాటు మరికొందరిపై కేసు నమోదయింది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చింది.
ఇదేకేసులోలాలూతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా ప్రకటించింది. దాణా కుంభకోణంలో లాలూకు శిక్ష పడడం ఇది నాలుగోసారి. 1990ల్లో లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం వెలుగుచూసింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. అనంతరం సుదీర్ఘకాలంపాటు విచారణ సాగింది. మొత్తం రూ.377.7 కోట్ల స్వాహాకు సంబంధించిన తొలికేసులో 2013 సెప్టెంబర్ 30న లాలూ దోషిగా తేలారు. ఆ కేసులో కోర్టు లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది.
శిక్ష పూర్తయ్యాక కూడా ఆయన ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీచేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించిన లాలూ…తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. దేవ్ గఢ్ కోశాగారం నుంచి అక్రమంగా నిధులు విడుదల చేసిన రెండో కేసులో కూడా లాలూ దోషిగా నిర్దారణ కావడంతో గత ఏడాది డిసెంబర్ 23 నుంచి ఆయన రాంచీలోని బిర్సా ముండా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. రూ. 37.62 కోట్ల విత్ డ్రాకు సంబంధించిన మరో కేసులో లాలూకు ఈ ఏడాది జనవరి 24న ఐదేళ్ల శిక్ష పడింది. దుమ్కాట్రెజరీ కేసు నాలుగోది కాగా, రాంచీలోని దొరాందా కోశాగారం నుంచి రూ. 139 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసిన ఐదో కేసు పెండింగ్ లో ఉంది.దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగుకేసుల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలగా, బీహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు మాత్రం రెండు కేసుల్లో ఊరట లభించింది.