టీడీపీకి, ఏపీ ప్ర‌జ‌ల‌కు నిజమైన మిత్రుడు బీజేపీనే..

Amith Sha Says BJP Is The Friend For TDP & AP People In His Letter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్ర‌ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హజ్వాల‌లు వ్య‌క్తంచేస్తున్న వేళ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చంద్ర‌బాబుకు లేఖ‌రాశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌స్తున్న సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాసిన లేఖ‌కు స‌మాధానంగా అమిత్ షా 9 పేజీల లేఖ రాశారు. కేంద్ర‌ప్ర‌భుత్వం త‌ర‌పున చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివ‌రాల‌ను అమిత్ షా త‌న లేఖ‌లో వివ‌రించారు. ముఖ్య‌మంత్రికి, ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు చెబుతూ అమిత్ షా త‌న లేఖ ప్రారంభించారు. కొత్త సంవ‌త్స‌రం అంద‌రికీ సంతోషాన్ని,మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. ఎన్డీఏ కుటుంబం నుంచి టీడీపీ వెలుప‌లికి వ‌చ్చిన త‌ర్వాత ఈ లేఖ రాస్తున్నాన‌ని, టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని, పూర్తిగా ఏక‌ప‌క్ష‌మైన‌ద‌ని,అభివృద్ధికి సంబంధించిన కార‌ణాల‌తో కాకుండా, రాజ‌కీయంగా తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల తాను భ‌య‌పడుతున్నాన‌ని అమిత్ షా వ్యాఖ్యానించారు. టీడీపీ నిర్ణ‌యం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.
అంద‌రూ అభివృద్ధి చెందాల‌నేదే త‌మ రాజ‌కీయ‌సిద్ధాంత‌మ‌ని, ఏపీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల‌నేది బీజేపీ అజెండాలో ఓ భాగ‌మ‌ని అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీకి ఎంతో చేసింద‌న్నారు. ఉమ్మ‌డి ఏపీని విడ‌దీయాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టినుంచీ ఇప్ప‌టిదాకా…రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌ని కోరుతున్న‌ది బీజేపీనే అని అమిత్ షా స్ప‌ష్టంచేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌నున కాంగ్రెస్ అసంబద్ధంగా చేప‌ట్టింద‌ని ఆరోపించారు. లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో టీడీపీకి మెజార్టీ లేన‌ప్పుడు ఏపీప్ర‌జ‌ల‌కోసం పోరాడింది బీజేపీనే అన్నవిష‌యం గుర్తుకుతెచ్చుకోవాల‌ని అమిత్ షా కోరారు. తెలుగుదేశానికి, ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజేపీనే నిజ‌మైన మిత్రుడ‌ని వ్యాఖ్యానించారు.
బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వంలో టీడీపీ కూడా భాగ‌స్వామిగా ఉంద‌ని, రాష్ట్ర విభ‌జ‌న‌తో పూర్తిగా అన్యాయానికి గురైన ఏపీని ఉన్న‌త‌స్థితిలోకి తీసుకెళ్లడానికి ఎన్డీఏ ప్ర‌భుత్వం ఎంతో కృషిచేసింద‌ని, ఏపీ కోసం కేంద్రం ఎంత సాయం చేయాలో అంతా చేసింద‌ని, ఏపీ అభివృద్ధికి మోడీ పూర్తిగా స‌హ‌క‌రించార‌ని అమిత్ షా తెలిపారు. ఏపీకి ఇచ్చిన కేంద్ర విద్యాసంస్థ‌లు, ఎయిమ్స్, ఇత‌ర‌త్రా  అంశాలు, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అమిత్ షా లేఖ‌లో ప్ర‌స్తావించారు. మూడు ఎయిర్ పోర్టుల‌ను అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలుగా మార్చిన‌ట్టు పేర్కొన్నారు. అమ‌రావ‌తి రైల్ రోడ్ నిర్మాణానికి, 180 కిలోమీట‌ర్ల రింగ్ రోడ్డుకు నిధుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించిన‌ట్టు చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సూత్ర‌ప్రాయ అంగీకారం తెలిపిన‌ట్టు పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చూప‌క‌పోవ‌డాన్ని అమిత్ షా త‌న లేఖ‌లో త‌ప్పుబ‌ట్టారు. 2016-17లో వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధికోసం ఇచ్చిన నిధుల్లో కేవ‌లం 12 శాతం నిధులు మాత్ర‌మే లెక్క‌లు చూపార‌ని, అమ‌రావ‌తికి రూ. 1000 కోట్లు విడుద‌ల చేస్తే కేవ‌లం 8శాతం నిధుల లెక్క‌లు మాత్ర‌మే పంపార‌ని  ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే మొత్తంగా లేఖ‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే…టీడీపీపై బీజేపీలో ఆగ్ర‌హం ఉన్న సంకేతాలు క‌నిపించ‌డం లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఎలాగోలా క‌న్విన్స్ చేసి మ‌ళ్లీ ఆయ‌న్ను ఎన్డీఏ వైపుకు తీసుకురావాల‌న్న ఉద్దేశం ఈ లేఖ‌లో ప‌రోక్షంగా క‌నిపిస్తోంది. టీడీపీకి,ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజేపీనే నిజ‌మైన మిత్రుడ‌ని అమిత్ షా వ్యాఖ్యానించ‌డమే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.