Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఏపీలో పోరు ఉధృత స్థాయికి చేరింది. వైసీపీ, వామపక్షాలు, జనసేన పాదయాత్ర, బంద్ తో హోరెత్తిస్తుండగా… అధికారపక్షం టీడీపీ కూడా దీక్షలు, సైకిల్ యాత్రలతో కేంద్రంపై ఒత్తిడితెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏపీ హామీల అమలు డిమాండ్ తో తన పుట్టినరోజైన ఈ నెల 20న ఒకరోజు దీక్ష చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమయింది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు దీక్ష ద్వారా ఒక తాటిపైకి తేవాలని భావిస్తున్న టీడీపీ మరో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చేపట్టనున్న నిరసన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు పాల్గొననున్నారు. ఇక రాష్ట్ర మంత్రుల్లో 13 మంది 13 జిల్లాల్లో దీక్షలు చేయనున్నారు. మిగిలినవారు రాజధానిలో ముఖ్యమంత్రితో పాటు దీక్షలో పాల్గొంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దీక్ష అనంతరమూ విభజన హామీల కోసం టీడీపీ పోరాటాన్ని కొనసాగించనుంది. దీక్ష తర్వాతి రోజు 21 వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పదిహేను నుంచి ఇరవై రోజులపాటు గ్రామాల్లో టీడీపీ సైకిల్ యాత్రలు జరపాలని, నియోజక వర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపడంతో పాటు ప్రభుత్వ విజయాల పండుగలు నిర్వహించాలని కోరారు. ఒకరోజు సిమెంట్ రోడ్ల గురించి, మరొకరోజు విద్యుత్ విజయాలు, ఇంకోరోజు పింఛన్లు ఇలా రోజుకో విజయం గురించి ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ అభివృద్ధి గురించి పక్కరాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయని, ఏపీ అభివృద్ధి అద్భుతంగా ఉందని తమిళనాడు ప్రజలు అనుకుంటున్నారని, చరిత్రలో గతంలో జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.
అభివృద్ధి జరిగిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయామని, పనులు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సైకిల్ యాత్రల ద్వారా ప్రజల్లో కదలిక, ఊపు తీసుకురావాలని, నాలుగేళ్లలో సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధితో పాటు హక్కులకోసం చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్ష వైసీపీపై చంద్రబాబు మరోమారు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారంతో ఫేక్ రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.