గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడలో దారుణం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు వేస్ట్ మెటీరియల్‌ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. మహిళా ఒంటరిగా ఉందని గమనించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు షాక్‌కు గురయ్యారు. బాధితురాలికి భర్త,ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను, ఇతర సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.