‘‘తెలుగుదేశం పార్టీ వల్లకానీ, ఒకవేళ జగనే ముఖ్యమంత్రి అయినా కానీ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. మూడో కూటమి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది’’ ఇది ఆ మధ్య సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసేన, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, ఎంసీపీఐ, బీఎస్పీ తదితర పార్టీలతో మూడో అతి పెద్ద కూటమి ప్రజల ముందుకు వస్తామని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ, ఈ మూడో కూటమి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని ఆయన ప్రకటించారు అప్పట్లో. మరోపక్క సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరో అడుగు ముందుకేసి రానున్న ఎన్నికల్లో వామపక్ష, జనసేన పార్టీల సియం అభ్యర్ధి పవన్కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు.
అయితే ఇంకా పూర్తిగా కూటమే ఏర్పాటు కాకుండా పవనే సీఎం అభ్యర్ధి అని వారు ప్రకటించటం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆదిలోనే వారి మహాకూటమి ఏర్పాట్లకి చుక్కెదురైంది. అదేంటంటే ఆమ్ ఆద్మీ మద్దతు ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళేలా కనపడుతోంది. గత కొద్ది రోజుల క్రితం గవర్నర్ విషయంలో సత్యాగ్రహం చేస్తున్న కేజ్రీవాల్ ని బాబు పరామర్శించారు. ఆ సమయంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల అధినేతలను కూడా ఆయన వెంట తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించారు. అప్పుడే బాబు కూటమికి ఒకరకంగా మద్దతు వచ్చేసింది. కానీ ఇవన్నీ పట్టించుకునేంత తీరికలేని మహా కూటమి నేతలు ఆప్ కూడా తమ జట్టే అన్న భావనలో ఉన్నారు. అయితే ఈరోజు కేంద్రం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాసం మీద మద్దతు ప్రకటించిన ఆప్, ఎపీకి బీజేపీ న్యాయం చేసే వరకు టీడీపీ వెంటే నిలబడతామని ప్రకటించింది. దీంతో కూటమి మొదలవ్వకుండానే మహా కూటమికి ఆప్ నో చెప్పినట్టయ్యింది.