సినీ నటుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశం విడిచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియా కేసులో అదుపులోకి తీసుకున్న శివాజీని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శివాజీ కోర్టును ఆశ్రయిస్తూ…పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్లో కోరాడు. టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీ కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తమను మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకున్నారని అలంద మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వారిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రవి ప్రకాష్, శివాజీ ల నివాసంలో సోదాలు కూడా నిర్వహించారు. నోటీసులు అందడంతో రవి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. శివాజీ కి కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. కానీ ఈరోజు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేయడంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.