Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
70 రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. స్టార్ మాటీవీలో ప్రసారమయిన బిగ్ బాస్ షో విజేతగా శివబాలాజీ నిలిచాడు. గ్రాండ్ గా జరిగిన ఫైనల్ లో సీజన్ -1 విజేతను షో యాంకర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. షో చివరి రోజుల్లో శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ ముగ్గురిలో ఒకరు విజేతగా నిలుస్తారని ఊహాగానాలు వచ్చాయి. హరితేజ పేరు ఖాయమైనట్టే అనుకున్నారు. కానీ ఆమెకన్నా ఎక్కువగా శివబాలాజీకి ఓట్లు పోలయ్యాయి. దాదాపు 11కోట్ల మంది ప్రేక్షకులు ఓటింగ్ లో పాల్గొనగా…శివబాలాజీ అందరికన్నా ఎక్కువగా మూడు కోట్లకు పైగా ఓట్లు సాధించాడు.
బిగ్ బాస్ సీజన్ -1 ట్రోఫీతో పాటు రూ. 50లక్షల ప్రైజ్ మనీ ని ఎన్టీఆర్ శివబాలాజీకి అందించాడు. ఫైనల్ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఫైనల్ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. శివబాలాజీని హౌస్ మేట్స్ అందరూ అభినందించారు. షోలో గతంలోనే ఎలిమినేట్ అయిన ఆర్టిస్టులకు పలు కేటగిరీల్లో జూనియర్ ఎన్టీఆర్ అవార్డులు అందించాడు.
మొత్తం ఈ షోలో 16 మంది పాల్గొన్నారు. చివరకు ఐదుగురు హౌజ్ లో మిగలగా…వారిలో అర్చన, నవదీప్ వెనకబడడంతో ఫైనల్ కు ముందే బిగ్ బాస్ హౌస్ ను వదిలారు. ఫైనల్లో శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ మిగలగా….శివబాలాజీ , ఆదర్శ్ మధ్య తుది పోటీ నెలకొంది. చివరకు ..అందరికన్నా ఎక్కువ ఓట్లు గెలుచుకున్న శివబాలాజీ సీజన్ -1 విజేత ట్రోఫీ అందుకున్నాడు.