Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ తెలుగు రాష్ట్రాలలో జంపింగ్లు మొదలయ్యాయి. ఓ పార్టీ నుండి మరో పార్టీకి మారేవారేకాక కొత్త వారు కూడా పార్టీలలో జాయిన్ అవుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. టాలీవుడ్‌లో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం పై మాధవీలత కూడా పోరాటానికి ముందుకు వచ్చారు. అయితే పవన్ మీద శ్రీ రెడ్డి దూషణల నేపధ్యంలో దీక్ష కూడా చేసిన ఆమె పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగింది.
ఆమె కూడా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని ఆయన చేయమంటే జనసేన కి ప్రచారం చేస్తా అని ప్రకటించింది. అయితే ఏమయిందో ఏమో కానీ, ఆమె అనూహ్యంగా బీజేపీలో చేరి పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానులకు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి కేంద్ర మంత్రి గడ్కరీ శనివారం నగరానికి విచ్చేసారు ఈ సందర్భంగా గడ్కరీని కలిసిన మాధవీలత ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆమెతో పాటు కార్వాన్ కాంగ్రెస్ నేత అమర్ సింగ్, కేయూ మాజీ వీసీ వైకుంఠంలు కూడా బీజేపీలో చేరారు.