తెలంగాణ లోని గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ మరోసారి పోటీచేస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంలో ప్రజకూటమి తరపున పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి విజయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బృహత్తరమైన కార్యంగా రూపుదాల్చింది. వంటేరు ప్రతాప్ రెడ్డి బలమైన నాయకుడు కావడం, మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మరో బలమైన నాయకుడు నర్సారెడ్డి కూడా తోడవ్వడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి కూడా విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పొచ్చు. గజ్వేల్ లో తమ ఎన్నికల ప్రచారం జోరు మరింత పెంచాలని భావించిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ తరపున కాంగ్రెస్ ముఖ్యనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ మరియు స్టార్ క్యాంపైనర్ గా సినీనటి నగ్మా లను రంగంలోకి దింపింది. తన ప్రచారంలో భాగంగా గులాం నబీ ఆజాద్ తెరాస పార్టీ మరియు కేసీఆర్ లను తీవ్రంగా విమర్శించారు. “సచివాలయానికి రాకుండా, కనీసం ప్రజలకు కనిపించకుండా తన ఫామ్ హౌజ్ నుండి పాలన చేసిన దేశంలోని రాష్ట్ర సీఎం లలో ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, కెసిఆర్ నియంత పాలనకి, తన కుటుంబ పాలనకి ప్రజలు విసుగు చెందారని, తెలంగాణ అంటే తన జాగీరు కాదనే విషయం ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకుంటే మంచిదని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రజకూటమికి ఓట్లు వేసి గెలిపించబోతున్నారని, సుమారు ఎనభై సీట్ల విజయంతో ప్రజకూటమి అధికారంలోకి రాబోతుందని, కేసీఆర్ కోరుకున్నట్లుగానే అతన్ని తన ఫామ్ హౌజ్ కే పరిమితం చేద్దామని” అని ఆజాద్ ప్రసంగించారు.
అంతేకాకుండా, 2004 ముందువరకు కేసీఆర్ అనే కుటిలుడు ఒక నేతగా ఎవరికి తెలియదని, కాంగ్రెస్ పార్టీ తో పొత్తు కుదుర్చుకొని, కొన్ని సీట్లు గెలిచాకనే ప్రజల దృష్టిలో పడ్డాడని, అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని విమర్శిస్తున్నారని, యేరు దాటాక తెప్ప తగలేసే నైజం కేసీఆర్ ది అని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ కి ఓటు వేస్తే, బీజేపీ కి ఓటు వేసినట్టేనని, ప్రజలంతా ఈ నియంత పాలనకు స్వస్తి పలకాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజకూటమి అధికారంలోకి వస్తే, గజ్వేల్ నియోజకవర్గానికి సముచిత స్థానం కల్పించడంతో పాటు, జాతీయ ప్రాజెక్టుని ఏర్పాటుచేసి, ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం కొసమెరుపు. ప్రచారానికి స్టార్ క్యాంపైనర్ గా తోడైన సినీనటి నగ్మా ప్రసంగిస్తూ, తెరాస పార్టీ ఒక దగాకోరు అని, తెలంగాణ ప్రజల ఆశల్ని దగా చేసిందని విమర్శలు చేశారు. నగ్మా ప్రసంగిస్తున్న వేళ కొందరు పూలు తనపైకి చల్లడంతో కొంత ఆందోళన చెలరేగింది.
పూలు చల్లకూడదని కాంగ్రెస్ నేత నర్సిరెడ్డి (తెరాస మాజీ ఎమ్మెల్సీ) వారించడంతో తేలికపడింది.కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తున్నా, గజ్వేల్ లో కేసీఆర్ విజయం ఖాయం చేయాల్సిన బాధ్యతను స్వయంగా హరీష్ రావు తన భుజాలపై ఎత్తుకొని, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలలో ప్రచార బాధ్యతలను 8 మంది నేతలకు అప్పగించి మరీ సమీక్షిస్తూ, ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రచారంలో భాగంగా కేసీఆర్ కి గజ్వేల్ లో పర్యటించే సమయం లేకుండడం, అంతటా హరీష్ రావు కనిపిస్తున్నా, గజ్వేల్ ని పూర్తిగా అభివృద్ధి చేశామనే మంత్రంగా ముందుకు సాగుతున్న తెరాస శ్రేణులలో, కేసీఆర్ రాష్ట్రప్రజలకే కాదు, నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండరని ప్రజలు ఆలోచిస్తే కేసీఆర్ విజయం సునాయాసం అవ్వగలుగుతుందా అనేది కొన్ని రోజుల్లో తేటతెల్లం అవుతుంది.