Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతీయ చలన చిత్ర రంగం మీద తన అందం , నటనతో తిరుగులేని ముద్ర వేసిన అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మోహిత్ మిర్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్ , చిన్న కుమార్తె ఖుషీ కపూర్ తో కలిసి దుబాయ్ వెళ్లిన ఆమె హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురి అయి అక్కడే కన్నుమూశారు. ధడాక్ సినిమా షూటింగ్ వున్న కారణంగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఆ పెళ్ళికి వెళ్ళలేదు. శ్రీదేవి మరణవార్త ఒక్క బాలీవుడ్ ని మాత్రమే కాదు యావద్దేశాన్ని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్త వట్టి పుకారు మాత్రమే అయి ఉంటుందని చాలా మంది అనుకున్నారు. నిజంగానే శ్రీదేవి చనిపోయిందని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోను అవుతున్నారు.
1996 లో నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయ్యారు. ఆపై కొన్నాళ్ళు వెండితెరకి దూరంగా వున్న శ్రీదేవి తిరిగి ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రంతో కెమెరా ముందుకు వచ్చారు. ఆపై తమిళ చిత్రం పులిలో , ఇటీవల మామ్ సినిమాలో శ్రీదేవి చివరిగా నటించారు. ఇప్పటిదాకా 15 ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్న శ్రీదేవిని భారత ప్రభుత్వం 2013 లో పద్మశ్రీతో గౌరవించింది.
దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో పాగా వేసిన శ్రీదేవి వయసు 54 ఏళ్ళు. 1963 , ఆగష్టు 13 న తమిళనాడులో జన్మించిన ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967 లో తొలిసారిగా బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో కెమెరా ముందుకు వచ్చారు. అంటే శ్రీదేవి వెండితెర ప్రస్తానం మొదలయ్యి 50 ఏళ్ళు అయ్యింది.
హీరోయిన్ గా తన కాలంలో వున్న సూపర్ హీరో లు అందరితో చేసింది. తెలుగులో అయితే మహా నటుడు ఎన్టీఆర్ కి బడిపంతులు సినిమాలో మానవరాలిగా చేసింది. తదుపరి హీరోయిన్ అయ్యాక వేటగాడు మొదలుకుని సర్దార్ పాపారాయుడు , బొబ్బిలిపులి, కొండవీటి సింహం …ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన సరసన చేసింది.ఇక అక్కినేనితో ఆమె చేసిన ప్రేమాభిషేకం ఎన్నో రికార్డులు తిరగరాసిన సినిమా. ఇక అక్కినేని తనయుడు నాగార్జున సరసన ఆఖరి పోరాటం లో హీరోయిన్ గా చేసింది. ఇక మెగా స్టార్ చిరు సరసన చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఎంత పెద్ద హిట్ అన్నది వేరే చెప్పనక్కర్లేదు. ఇక విక్టరీ వెంకీతో చేసిన క్షణక్షణం లో ఆమె నటన ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది.