తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత అభిమానులు మరియు ఆమె పార్టీ అన్నాడీఎంకే నేతలు, నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ‘సర్కార్’ చిత్రంపై దుమ్మెత్తి పోస్తున్నారు. సర్కార్ చిత్రంలో వరలక్ష్మి విలన్ గా నటించిన విషయం తెల్సిందే. వరలక్ష్మి పాత్ర పూర్తిగా జయలలితను పోలి ఉందని, ఆమె బాడీలాంగ్వేజ్ ఇతర కట్టు బొట్టు అన్ని కూడా అమ్మ నుండి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మను ఈ చిత్రంలో ఒక విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే నాయకులు సర్కార్ చిత్ర యూనిట్ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సినిమా యూనిట్ సభ్యులపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లుగా చెబుతున్నారు.
విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామా చిత్రం భారీ అంచనాల నడుమ తాజాగా విడుదలైన విషయం తెల్సిందే. అయితే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఉంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో 200 కోట్ల క్లబ్లో చేరబోతుంది. ఇలాంటి సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. సినిమాలో వరలక్ష్మి పేరు కోమరవల్లి, అయితే జయలలిత అసలు పేరు కోమరవల్లి అని, జయలలితను టార్గెట్‌గా చేసి, ఆమె ఇమేజ్ను తగ్గించేలా ఈ చిత్రంలో ఇంక చాలా సీన్స్‌ను పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో అంటూ తమిళ సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.