Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత అన్నాడీఎంకెలో ప్రక్షాళన జరుగుతోంది. పార్టీలో ఉంటూ దినకరన్ కు అనుకూలంగా పనిచేశారని భావిస్తున్న వారిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు పళని, పన్నీర్ సెల్వం. గురువారం 44 మంది దినకరన్ మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించిన అన్నాడీఎంకె శుక్రవారం 130మందిపై వేటువేసింది. తిరుపూర్ నుంచి 65 మందిని, పుడుకొట్టాయ్ నుంచి 49 మందిని, ధర్మపురి నుంచి 18 మందిని పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వీళ్లంతా పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రక్షాళన కార్యక్రమం కొనసాగనున్నట్టు తెలుస్తోంది. దినకరన్ విజయం సాధించాక సుమారు 50 మంది అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు ఆయనకు ఫోన్ లో శుభాకాంక్షలు చెప్పినట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకదృష్టి పెట్టిన ఓపీఎస్, ఈపీఎస్ వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.
దినకరన్ కు మద్దతిచ్చేందుకు వారు సిద్ధమైతే… తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అటు దినకరన్ అన్నాడీఎంకెపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో ఓ ఐదారుగురు సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, వారు తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరలో పడిపోతుందని కూడా హెచ్చరించారు. దినకరన్ వ్యాఖ్యలపై స్పందించడానికి పన్నీర్ సెల్వం నిరాకరించారు. అదంతా దినకరన్ కల మాత్రమే అని, ఆయన కలలపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని చెప్పారు. మొత్తానికి జయ మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక తీవ్ర అలజడి కలిగిస్తోంది.