Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నవేళ ఓ మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య దేశరాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితాన్ని ట్రిపుల్ తలాక్ తో ముడిపెడుతూ ఆమె చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. మోడీ తన పెళ్లయిన కొన్ని రోజులకే భార్య యశోదాబెన్ ను వదిలేసి ప్రజాజీవితంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అసలు మోడీ ప్రధాని పదవికి పోటీపడేదాకా ఆయన వైవాహిక జీవితం గురించిన రహస్యాలు ఎవరికీ తెలియవు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను బ్రహ్మచారిగా కూడా అంతా భావించారు. అయితే ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తూ సమర్పించిన అఫిడవిట్ లో ఆయన తనకు పెళ్లయిందని స్వయంగా చెప్పడంతో ఇక అప్పటినుంచి ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భార్యకు న్యాయం చేయలేనివ్యక్తి దేశప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ అంశాన్ని లేవనెత్తి మోడీని పార్లమెంట్ లో ఇబ్బందికి గురిచేయాలని కూడా ప్రయత్నించాయి.
అయితే బీజేపీ వాటన్నింటినీ తిప్పికొట్టింది. అదే సమయంలో మోడీ భార్య కూడా ప్రజల్లోకి రావడానికి ఇష్టపడలేదు. ఆమె ఎప్పుడూ ప్రచారానికి, మీడియాకు దూరంగా ఉంటారు. మోడీ వదిలివెళ్లిన తర్వాత బాగా చదువుకుని టీచర్ వృత్తిలో రాణించారు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితం గడుపుతున్నారు. మోడీకి అనకూలంగా గానీ, వ్యతిరేకంగాగానీ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇక ఈ అంశంలో వివాదం సృష్టించడానికి అవకాశం లేక ప్రతిపక్షాలు మిన్నకుండిపోయాయి. అయితే ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆప్ ఎమ్మెల్యే ఒకరు మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ట్రిపుల్ తలాక్ చెప్పడం, జైలుకు వెళ్లడం ఎందుకని, ఏమీ చెప్పకుండా భార్యను వదిలేసి వెళ్తే.. దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ లో ఆమె చేసిన ఈ ట్వీట్ పై పెద్ద దుమారమే రేగింది. అల్కా లంబా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు కొందరు నెటిజన్లు మాత్రం మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. భార్య యశోదాబెన్ కు తీవ్ర అన్యాయం చేసిన మోడీకి ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ట్రిపుల్ తలాక్ నేపథ్యంలో మోడీ వైవాహిక జీవితంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.