Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే సిడ్నీలో మీడియాతో మాట్లాడుతూ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా..ఇప్పుడు మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా మీడియా ముందు భోరున ఏడ్చాడు. జొహెన్స్ బర్గ్ నుంచి తిరిగి స్వదేశానికి వస్తూ విమానంలో ట్విట్టర్ ద్వారా క్రికెట్ అభిమానులను క్షమాపణ కోరిన వార్నర్…ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత తొలిసారి బాల్ టాంపరింగ్ వివాదంపై పెదవి విప్పాడు. ముందుగా సిద్దం చేసుకున్న ప్రసంగాన్ని చదివి వినిపిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా భోరున విలపించాడు.
తాను క్షమించరాని నేరం చేశానని అంగీకరించాడు. ఏదో ఒక రోజు తాను తిరిగి దేశం కోసం ఆడతానన్న ఆశ ఏదో మూల ఉందని అనిపిస్తోందని, అదే సమయంలో ఆ అవకాశం లేదన్న చేదు నిజం తనకు తెలుస్తోందని ఆవేదన వ్యక్తంచేశాడు. తాను ఈ తప్పిదానికి ఎలా పాల్పడ్డానన్న విషయాన్ని వచ్చే రోజుల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటానన్నాడు.
అసలు వ్యక్తిగా తానెవరినన్న విషయాన్ని అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. దేశానికి తాము తలవంపులు తీసుకొచ్చామని, ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నామని పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు. అటు బాల్ టాంపరింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే…ఆసిస్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన క్రికెట్ ప్రపంచం…ఇప్పుడు మాత్రం వారిపై సానుభూతి వ్యక్తంచేస్తోంది. గురువారం మీడియా సమావేశంలో స్మిత్ కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత..మాజీ క్రికెటర్లకు, అభిమానులకు వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లపై ఆగ్రహం తగ్గిపోయింది. ఆస్ట్రేలియా సహా అన్నిదేశాల మీడియాలోనూ స్మిత్ కు మద్దతుగా కథనాలు వచ్చాయి. ప్రియమైన ఆస్ట్రేలియా..ఇక చాలు..వాళ్లు చేసింది బాల్ టాంపరింగ్. హత్య కాదు..అని ప్రముఖ పత్రిక టైమ్స్ పేర్కొంది.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తంచేశాడు. మాకు కోపం వచ్చింది…బాధ కలిగింది..కానీ ఈ స్థితిలో ఎలా స్పందించాలో తెలియలేదు. జరిగిన తప్పుకంటే ఎక్కువే స్పందించాం. అందుకే వాళ్లు చేసిన తప్పులు కంటే ఎక్కువే శిక్షలు పడ్డాయి అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కు రాసిన వ్యాసంలో పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆసిస్ ఆటగాళ్లకు అండగా నిలిచే ప్రయత్నంచేశాడు. కష్టకాలంలో ధైర్యంగా నిలబడే శక్తిని దేవుడు వారికి ఇవ్వాలని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
ఎవరైనా ఒక్కసారి ఏడిస్తే చాలు..జనాలు సంతృప్తి పడిపోతారు. ఆపై సంతోషంగా ఉంటారు. జనాల్లో జాలిఇంకా ఉంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో అవసరమైన శక్తిని దేవుడు స్మిత్, బాన్ క్రాఫ్ట్ లకు ఇవ్వాలి. వార్నర్ కు కూడా ఆ శక్తి అవసరం. ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఘం వారికి అండగా నిలబడుతుందని ఆశిస్తున్నా…అని అశ్విన్ చెప్పాడు.