Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా “ అంటూ బన్నీ హీరోగా వస్తున్న సినిమా టీజర్ కి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాని ఒకటి రెండు కాదు మొత్తం 7 భాషల్లో విడుదల చేయడానికి కూడా ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కారణం. అయితే ఈ టీజర్ చూస్తుంటే ఎక్కడో ఏ సినిమాలోనో చూసినట్టుంది అని హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే కొందరు కుర్ర దర్శకులు, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కి డౌట్ వచ్చిందట. అందుకే వాళ్ళు ఈ సినిమా కథ ఎక్కడ నుంచి వచ్చిందా అని వలేసి వెదికారు. అందులో దర్శకుడు కం రచయిత వక్కంతం వంశీ సీక్రెట్ బయటపడిపోయిందట. 2002 లో వచ్చిన హాలీవుడ్ సినిమా Antwone ఫిషర్ అనే సినిమా లో దృశ్యాలు ఇప్పుడు “ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా “ టీజర్ లో కనిపిస్తున్నాయట. అప్పట్లో “ఫైండింగ్ ఫిష్ “ అనే నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.
ఆ నవల కథ ప్రకారం హీరో మిలిటరీలో పని చేస్తుంటాడు . అతని ఆవేశం వల్ల ఇబ్బందులు ఎదురు అవుతాయన్న సందేహంతో ప్రత్యేక శిక్షణ, పరీక్ష కోసం అతన్ని మిలిటరీ నుంచి బయటకు పంపిస్తారు. సమాజంలోకి వచ్చి చూసిన హీరోకి అక్కడ పరిస్థితులు ఘోరంగా అనిపిస్తాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నంలో హీరో కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథ వింటుంటే కాస్త అటుఇటుగా అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హీరోగా దాసరి నారాయణరావు తీసిన బొబ్బిలిపులి కథ గుర్తుకు రావడం లేదూ!