అల్లుడే చంపాడంటున్న ప్రత్యూష తండ్రి !

alluday-kills-prathushas-father

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేక ప్రత్యూష (32) అనే వివాహిత అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుషకు అల్వాల్‌‌కు చెందిన శశికాంత్‌రావుతో 2013లో వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్‌ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌ రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టచెప్పాడు. అయినా శశికాంత్ మరో రూ.50 లక్షలు తీసుకురావాలని కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు.

దీంతో ప్రత్యూష బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ప్రత్యూష ఎంతో ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నా మౌనంగా భరించిందని తెలిపారు. అల్లుడే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

అతడు బినామీ పేర్లతో ఎన్నో స్థలాలు కబ్జా చేశాడని, కృష్ణారెడ్డి అనే ఎక్స్ సర్వీస్‌మెన్ భూమిని లాక్కుని బెదిరించాడని చెబుతున్నారు. ప్రత్యూష మృతితో పాటు శశికాంత్ భూకబ్జాలపై పోలీసులు ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని వారు కోరుతున్నారు. వరకట్న వేధింపులతో తన బిడ్డ ఆరేళ్లు నరకం చూసిందని, ఎప్పటికైనా భర్త మారతాడని ఎదురుచూస్తూ చివరకు తానే ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.