Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పటికప్పుడు ఎదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బీజేపీ నేతలకు రోజూ వారీ దినచర్యగా మారింది. నిరుద్యోగులు పాన్ డబ్బాలు పెట్టుకోవాలని, మహా భారతంలోనే ఇంటర్నెట్ ఉందని త్రిపుర సీఎం బిప్లవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జర్నలిస్టులను నారదుడితో పోలుస్తూ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేసిన వ్యాఖ్యలు, చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని లేటు పెళ్లిళ్ల వలనే లవ్ జిహాద్ వంటి వ్యవహారాలు జరుగుతున్నాయని మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మర్ కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా రాజస్థాన్ లోని అల్వార్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హనుమంతుడు ప్రపంచంలోనే తొలి గిరిజన నేత అని, ఆయన తయారు చేసిన ఆదివాసీ దళానికి సాక్షాత్తూ శ్రీరాముడు శిక్షణనిచ్చాడని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణకు నిరసనగా ఏప్రిల్ 2న బర్మెర్‌లో బంద్ జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయుడి ఫోటోను ఓ బీజేపీ ఎంపీ కించపరిచారంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అహూజా ఈ వాఖ్యలు చేశారు. ప్రపంచంలో తొలి గిరిజన నేత అయినందున ఆంజనేయుడిని కించపరచడం తగదనేది అహూజా వాదన. ఈ ఎమ్మెల్యేకి ఇలాంటి వ్యాఖ్యలు కొత్తకాదు. 2016 ఫిబ్రవరిలో…. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజూ 3000 కండోమ్ లు 2000 లిక్కర్ బాటిళ్లు దొరుకుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2017 డిసెంబర్ లో….గోవధకు పాల్పడిన వారికి స్మగ్లింగ్ కు పాల్పడేవారికి ఒకే రకమైన శిక్ష విధించి చంపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.