Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ప్రముఖ నటి అమలాపాల్ అధికారికంగా ప్రెస్ నోట్ విడుదలచేశారు. అమల నకిలీ పత్రాలను చూపించి కోటి రూపాయల కారు కొన్నారంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అమల ప్రెస్ నోట్ లో వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని అమల స్పష్టంచేశారు. మల్ బార్ ప్రాంతానికి చెందిన ఓ పాత కాలం నాటి పత్రిక పాపులారిటీ కోసం తప్పుడు వార్తలు రాస్తోందని, ఈ వార్తలు చూసి తాను షాకయ్యానని అమల తెలిపారు. ఇలాంటి వార్తలపై స్పందించే హక్కు తనకుందని, తాను, తన కుటుంబ సభ్యులు ఈ వార్తలు చూసి ఎంతో బాధపడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఏడాది కోటిరూపాయలకు పైగా పన్ను కట్టిన తనపై ఇలా పన్ను ఎగ్గొట్టి కారు కొన్నానన్న వార్త రావడ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనిపై తాను వివరణ ఇచ్చినప్పటికీ… తప్పుడు వార్తల ప్రచురణ ఆగలేదని, ఇది సబబు కాదని అమల వ్యాఖ్యానించారు. తాను భారతీయురాలినని, ఏం కావాలన్నా కోరుకునే హక్కు తనకుందని, కానీ ఓ ప్రముఖ పత్రిక తప్పుడు వ్యాఖ్యలు రాస్తూ తన చరిత్ర తానే చెరిపేసుకుంటోందని ఆమె విమర్శించారు.
తమిళ, మళయాల సినిమాల్లో నటించిన తాను రెండు రాష్ట్రాల్లోనూ చెక్ లు తీసుకున్నానని, ఆమె తెలిపారు. తెలుగు సినిమాల్లో నటించడానికి ఎవరి అనుమతైనా తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం వచ్చిన తరువాత కూడా రాష్ట్రాల వారీగా ప్రజలను వేర్వేరుగా చూడడం బాధాకరమన్నారు. తమిళయన్లు, పంజాబీలు, గుజరాతీలు అన్న పదాలు రాబోయే తరాలకు ఉండకూడదని ఆశిస్తున్నానన్నారు. పేదరికం, అవినీతి, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాడదామని కోరారు. అంతేకానీ పబ్లిసిటీ కోసం న్యాయాన్ని, చట్టాన్ని అతిక్రమించకూడదని లేఖలో పేర్కొన్నారు అమలాపాల్.