Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్యాంగాన్ని కాపాడుదాం పేరుతో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రచార కార్యక్రమంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని కాపాడుదాం అనే ప్రచారాన్ని కాంగ్రెస్ తమ వారసత్వాన్ని రక్షించుకునేందుకే చేస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా మోడీ వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు భారత్ వ్యతిరేకిగా మారిందని దుయ్యబట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్నిఅమిత్ షా తీవ్రంగా ఖండించారు. సైన్యం, న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, ఈవీఎంలు, ఆర్ బీఐ ఇలా దేన్నీ నమ్మని ఓ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెబుతోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత్ ది శక్తిమంతమైన ప్రజాస్వామ్యమని, మనకు బలమైన రాజ్యాంగం ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పదే పదే అవమానిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ బతికి ఉన్నప్పుడు నెహ్రూ-గాంధీ కుటుంబం ఆయన్ను అనుక్షణం అవమానించిందని, అదే సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేపట్టిన రాజ్యాంగాన్ని కాపాడుదాం అనే ప్రచారం కేవలం వారి వారసత్వాన్ని కాపాడుకునేందుకే అని… అలాంటి కాంగ్రెస్ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమిత్ షా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.