Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల గురించి ఎవరికీ పరిచయం చేయనక్కరలేదు. ఒకటీ, రెండు సార్లు మినహా ఆ రెండు నియోజకవర్గాల్లో ఎప్పుడూ నెహ్రూ కుటుంబ సభ్యులదే గెలుపు. ఆ రెండు నియోజకవర్గాలు ఆ కుటుంబానికి తద్వారా కాంగ్రెస్ కు కంచుకోటలు. ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… అమేథీ, రాయ్ బరేలీలో గెలిచేది మాత్రం కాంగ్రెస్సే. దశాబ్దాల క్రితమే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి… నామమాత్రపు ఉనికితో నెట్టుకొస్తున్నా… ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదు. అలాంటి స్థానాలపై బీజేపీ కన్నేసింది. ముక్త కాంగ్రెస్ ను ఆశయంగా పెట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ కంచుకోటల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
2019 ఎన్నిలకు ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా అమేథీలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… నియోజకవర్గ ఎంపీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారు. అమేథీ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ కుటుంబ నేతలకు ఓట్లువేస్తున్నారని, అయినప్పటికీ వారు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని అమిత్ షా విమర్శించారు. రాహుల్ గాంధీని ఆయన రాహుల్ బాబాగా అభివర్ణించారు. అమేథీలో ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ లేదని, క్షయ రోగులకు వైద్యం చేయడానికి ఆస్పత్రి లేదని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు లేవని ఆయన మండిపడ్డారు. నెహ్రూ కుటుంబ నేతలకు మూడు తరాల నుంచి ఇక్కడి ప్రజలు ఓట్లు వేస్తున్నారని, వారిపై కృతజ్ఞత చూపించే విధానం ఇదేనా..? అని ప్రశ్నించారు.
70 ఏళ్లగా ఆ కుటుంబంపైనే నమ్మకంతో ఉన్న ప్రజలు ఇకపై మోడీ, బీజేపీపై నమ్మకం పెట్టుకోవాలని ఆయన సూచించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేయాలని కోరారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీచేసి ఓడిపోయినప్పటికీ స్మృతి ఇరానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని, గెలిచిన రాహుల్ గాంధీ మాత్రం నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే మానేశారని విమర్శించారు. ఇంతటి నిర్లక్ష్యపు ఎంపీని తాను ఎక్కడా చూడలేదన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వం 106 పథకాలను ప్రారంభించిందని, రాహుల్ బాబాకు 106 అంకెలు లెక్కబెట్టడం కూడా రాదని అమిత్ షా ఎద్దేవాచేశారు.