Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అక్టోబరు 11న 75వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఒక మనిషి జీవితంలో 75 ఏళ్ల వయసంటే… వృద్ధాప్యం కింద లెక్క. జీవిత చరమాంకం అని కూడా భావించవచ్చు. ఈ వయసులో సాధారణ వ్యక్తులయితే… కృష్టా, రామా అనుకుంటూ శేష జీవితం గడిపేస్తుంటారు. చేసేందుకు పెద్దగా పనిలేకపోవడం, ఓపికా, ఆసక్తీ లేకపోవడం కూడా ఆ వయసులో ఎక్కువమంది విశ్రాంత జీవితం గడపడానికి కారణాలు. ఆ క్రమంలో రోజంతా ఖాళీగా కూర్చునే వృద్ధులు జీవితంపై ఆసక్తి కోల్పోతారు. వైరాగ్యానికి అలవాటుపడతారు. గడచిన జీవితాన్ని అవలోకనం చేసుకుంటారు. మనదేశంలో 65 నుంచి 70 ఏళ్లు పైబడిన వారంతా చేసేది ఇదే. అయితే బిగ్ బీ అమితాబచ్చన్ 75 ఏళ్ల వయసులోనూ ఖాళీగా ఉండడం లేదు. సినిమాలతోనూ, కేబీసీతోనూ ఇప్పటికీ రోజంతా బిజీ బిజీగానే గడుపుతున్నారు. అయినప్పటికీ అమితాబ్ కు కూడా తన వయసువారిలానే వైరాగ్యపు ఆలోచనలు కలుగుతున్నట్టు ఆయన చేసిన పోస్ట్ చూస్తే అర్ధమవుతోంది.
75వ పుట్టినరోజు తర్వాత అమితాబ్ తన బ్లాగ్ లో మనసులోని ఆలోచనలు పంచుకున్నారు. పుట్టినరోజు వేడుకలు ఎందుకు జరుపుకోలేదో అందరికీ వివరించే ప్రయత్నంచేశారు. జీవితం చరమాంకంలో వేడుకలు అవసరమా అంటూ బ్లాగ్ ను ప్రారంభించారు. 75 ఏళ్ల తర్వాత అన్నింటికీ దూరంగా వెళ్లిపోతామని, ఈ వయసులో వేడుకలంటే ఇబ్బందిగా ఉంటుందని అమితాబ్ అభిప్రాయపడ్డారు. వేడుకంటే… ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎవరెవర్ని పిలవాలి, ఎలాంటి బహుమతులు అడగాలి ఇలా సవాలక్ష ప్రశ్నలుంటాయని, ఇవన్నీ జీవితంలో ముగిసిపోయే క్షణంలో ఎందుకని ఆయన ప్రశ్నించారు. పుట్టినరోజు నాడు తనవాళ్ల మధ్య కూర్చుని వాళ్లు చెప్పే సంగతులు వింటుంటే తనని తాను కోల్పోతున్నానన్న భయం కలుగుతోందని అమితాబ్ వ్యాఖ్యానించారు.
ఎన్నో ఏళ్లగా అక్టోబరు 11 తనకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తూ వచ్చిందని అమితాబ్ చెప్పారు. ఇలాంటి వేడుకలు చేసుకోవాలని చిన్నతనంలో అనిపించేది గానీ, ఇప్పుడు తనపై వెల్లువెత్తే శుభాకాంక్షలు తనను ఇబ్బంది పెడుతున్నాయని బ్లాగ్ లో రాసుకున్నారు అమితాబ్. మరోవైపు అమితాబ్ పోస్ట్ పై ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిగ్ బి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని తాము కోరుకుంటున్నామని, అలాంటిది అప్పుడే ఆయన తాను జీవితం చివరి దశలో ఉన్నాననడం ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. బిగ్ బీ ఇలా వైరాగ్యంలోకి జారిపోకూడదని, ముందు ముందు మరిన్ని సినిమాలతో ఆయన ప్రేక్షకులను అలరిస్తారని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.