Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరైనా తోటి వ్యక్తులకు సలహా ఇచ్చేటప్పుడు ముందుగా తాము ఆచరించి చూపిన తర్వాతే ఇతరులకు చెప్పాలి. లేదంటే వాళ్లు చెప్పే మాటలు హాస్యాస్పదంగానూ, విలువ లేనివిగానూ అనిపిస్తాయి. సెలబ్రిటీలయితే ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలను, ప్రవర్తనను… అందరూ కనిపెడుతూ ఉంటారు కాబట్టి ఎవరితో వేలెత్తి చూపించుకోలేని విధంగా వ్యవహరించాలి. అలా కాకుండా ఇతరులకు మాత్రం నీతులు చెబుతూ తాము మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తామంటే కుదరదు. ఇలా చేస్తే అందరిలో అపహాస్యానికి గురవడంతో పాటు పరువూ పోగొట్టుకోవాల్సి వస్తుంది. బుల్లితెర మేల్ యాంకర్ ప్రదీప్ ఇప్పుడాపరిస్థితినే ఎదుర్కొంటున్నాడు.
యాంకరింగ్ రంగంలో ఆడవాళ్లు రాజ్యమేలుతున్న సమయంలో… ప్రదీప్ మేల్ యాంకర్ గా బుల్లితెరపై చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. యాంకర్ అంటే అమ్మాయి అని అనధికారంగా ఉన్న భావనను ప్రదీప్ తొలగించాడు. తనదైన శైలిలో దూసుకుపోయాడు. చేసిన ప్రతీ కార్యక్రమంలోనూ తన ముద్ర వేశాడు. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలను హిట్ చేశాడు. బుల్లితెర ఇమేజ్ తో వెండితెరపైనా అవకాశాలు దక్కించుకున్నాడు. సొంతంగా టీవీ కార్యక్రమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇన్ని ఘనతలతో ఒకప్పుడు యువతకు రోల్ మోడల్ గా ఉన్న ప్రదీప్… డిసెంబరు 31 అర్ధరాత్రి చేసిన పనితో ఒక్కసారిగా బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడి పరువుపోగొట్టుకున్నాడు. ప్రదీప్ కేస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన రెండు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి ప్రదీప్ తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వీడియో కాగా, మరొకటి గతంలో మద్యం తాగి డ్రైవ్ చేయకూడదంటూ ప్రదీప్ నీతివాక్యాలు చెబుతున్న వీడియో. ఈ రెండు వీడియోలను పక్కపక్కన ప్లే చేస్తూ టీవీ చానళ్లు ప్రదీప్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తాగొద్దని నీతి వాక్యాలు చెప్పిన వ్యక్తే… తప్పతాగి దొరికిపోయాడంటూ ఎద్దేవా చేస్తున్నాయి. టీవీ చానళ్లే కాదు… సాధారణ టీవీ ప్రేక్షకులు కూడా ప్రదీప్ తీరును తప్పుబడుతున్నారు.