Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తాను చేసిన తప్పు ఎవరూ చేయొద్దని మరోసారి విజ్ఞప్తిచేశాడు యాంకర్ ప్రదీప్. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ప్రదీప్ సోమవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. తండ్రితో కలిసి కౌన్సెలింగ్ కు వచ్చిన ప్రదీప్ మిగతా వారితో పాటు కూర్చుని పోలీసులు చెప్పే సూచనలు శ్రద్ధగా విన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రదీప్ పోలీసుల కౌన్సెలింగ్ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పాడు. కౌన్సెలింగ్ చాలా కీలకమైనదని, డ్రంకెన్ డ్రైవ్ వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నదానితో పాటు తాగి నడపడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు, ఎందుకు తాగి నడపకూడదన్నది కౌన్సెలింగ్ లో చాలా స్పష్టంగా వివరించారని తెలిపాడు. తాగినప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చోవద్దని పోలీసులు చెప్పారని, తాను మరోసారి ఈ తప్పు చేయబోనని, దయచేసి తాను చేసింది ఇంకెవరూ చేయవద్దని కోరాడు. బాధ్యతగల వ్యక్తిగా తనకు తోచినంత వరకు ఈ విషయాలను మిగతావారికి చెప్పేందుకు ప్రయత్నిస్తానన్నాడు.
తనకు సహకరించిన ట్రాఫిక్ పోలీసులు, మీడియా, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. షూటింగుల్లో బిజీగా ఉన్నందువల్లే తాను కౌన్సెలింగ్ కు లేటుగా వచ్చానని, అంతే తప్ప తానేం పారిపోలేదని అన్నాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన ముందుగా ఆదేశించినదాని ప్రకారం కౌన్సెలింగ్ కు హాజరు కాకపోవడంతో కేపీహెచ్ బీలోని ప్రదీప్ కార్యాలయంతో పాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అంటించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనక్కివచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. దీంతో ప్రదీప్ గత శుక్రవారం ఓ వీడియో విడుదలచేశాడు. తాను చేసిన తప్పు ఎవరూ చేయవద్దని కోరాడు. త్వరలోనే కౌన్సెలింగ్ కు హాజరవుతానని చెప్పాడు.






