Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. రాజకీయంగా, పాలనాపరంగా ఇద్దరు ఉద్దండులైన ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ కి ఇప్పుడు అత్యంత ఆప్తుడు రాధాకృష్ణ. ఇందులో ఎవరికి ఏ డౌట్ వున్నా పరిటాల శ్రీరామ్ పెళ్ళిలో రాధాకృష్ణ కదలికలు ఒక్కసారి చూస్తే చాలు. ఒకప్పుడు ABN ఛానల్ ని తెలంగాణాలో రాకుండా ఆపిన కెసిఆర్ ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో రాధాకృష్ణని ఎక్కించుకుని మరీ వెంకటాపురం వెళ్లారు. ఇక చంద్రబాబుతో ఆర్కే బంధం జగమెరిగిందే . ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి ఈ ఇద్దరితో దగ్గరగా మెసలడం చిన్న విషయం ఏమీ కాదు. అలాంటిది ఈ ఇద్దర్నీ రాజకీయంగా ఒకే దిశగా నడిపించడం అంతకు మించిన విషయం.
గత కొద్ది నెలలుగా టీడీపీ, బీజేపీ మధ్య బంధం మీద రాధాకృష్ణ రాసిన సంపాదకీయాలు చూస్తే ఓ విషయం బాగా అర్ధం అవుతుంది. ఆ ఇద్దరి బంధం కొనసాగదని రాధాకృష్ణ నమ్ముతున్నారు. బీజేపీ రాజకీయాలు టీడీపీ ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు…బీజేపీ తో తెగదెంపులు చేసుకుంటేనే టీడీపీ కి భవిష్యత్ బాగుంటుందని ఆర్కే భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బాబు మెడకి చుట్టుకోడానికి ఓటుకి నోటు కేసు సిద్ధంగా వుంది. అదే కేసులో కెసిఆర్ కూడా కసిగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటో తెలుసు. ఒకవేళ చంద్రబాబు, కెసిఆర్ రాజకీయంగా ఒకటైతే సీన్ అంతా మారిపోతుంది. ఈ ఆలోచన ఇద్దరు చంద్రుల మనసులోకి ఎక్కించడానికి రాధాకృష్ణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఆ ప్రయత్నాలు విజయవంతం అయితే రాజకీయంగా పెను సంచలనం అవుతుంది . టీడీపీ ,తెరాస రాజకీయంగా ఒక్క తాటి మీదకి వస్తే అది కచ్చితంగా రాధాకృష్ణ లీల అవుతుంది.