Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాయకుడు అనే వాడు ఎలా ఉండాలి అనేదాని మీద రాజనీతిజ్ఞులు ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ఇక తత్వవేత్తలు ఇంకెన్నో ఉపమానాలు చెప్పారు. కానీ జనసామాన్యం దృష్టిలో మాత్రం ఎదురుగా వున్నది ఎంత పెద్దవాడైనా తలవంచక ఢీకొట్టేవాడే నాయకుడు. ఫలితం గెలుపైనా, ఓటమి అయినా పర్లేదు. పోరాడేవాడు నాయకుడు అని జనం నమ్మారు. అందుకే ఎన్ని విమర్శలు వున్నా సోనియా ని ఢీకొట్టడంతో జగన్ ని ఓ నాయకుడిగా అంగీకరించారు. మాట మార్చను, మడమ తిప్పను అని ఆయన చెప్పిన దాన్ని విశ్వసించారు. ఆయన్ని వైసీపీ శ్రేణులు ఓ వీరుడిగా వూహించుకున్నాయి. వారి గుండెల్లో ఉన్న ఆ ముద్రని ఇప్పుడు జగన్ స్వయంగా తుడిచేస్తున్నారు.
వై.ఎస్ హవా కొనసాగిన కాలంలో జగన్ అండ్ కో చంద్రబాబు మీద చేసిన యుద్ధం కన్నా రామోజీ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే సాక్షి పుట్టింది. ఆ టైం లో రాధాకృష్ణ తమకి వ్యతిరేకం అని తెలిసినా ఆయనకి సాక్షిలో స్థానం ఇచ్చేంత ప్రాధాన్యం ఇవ్వలేదు. నీ స్థాయి మాది కాదు అని జగన్, సాక్షి పదేపదే ఆర్కే కి గుర్తు చేశారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి, 2019 ఎన్నికల్లో ఓటమి భయం కలిసి జగన్ మాట మారేలా చేశాయి. మడమ తిప్పేలా చూశాయి. ఆయనే స్వయంగా రామోజీ దగ్గరికి వెళ్లి నా పాదయత్రకి కవరేజ్ బాగా ఇవ్వండని వేడుకోవడం వైసీపీ లోనే చాలా మందికి నచ్చలేదు. జగన్ తీరు నచ్చడం లేదు.
ఇక మీడియా అందరినీ పిలిచి ఆర్కేని పిలవకపోవడం ద్వారా జగన్ ఏమి సాధించారో తెలియదు గానీ ఆర్కే నిజంగా జనం దృష్టిలో హీరో అయ్యాడు. టీడీపీ అభిమానులు ఆర్కే ని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకుంటుంటే,ఇక వైసీపీ వాళ్ళు కూడా రామోజీని కలిసాక ఆర్కే ని టార్గెట్ చేయడంలో అర్ధం లేదంటున్నారు. ఇంత జరిగిన ఆర్కే వీరుడు ఎందుకు అయ్యాడంటే తనకు జగన్ ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు అన్నది పక్కనబెట్టి ఆయన పాదయాత్ర షెడ్యూల్ వార్తని టాప్ లో ప్రచురించాడు. ఓ వ్యక్తిగానే కాదు. జర్నలిస్టుగా ఆర్కే వీరుడు అనిపించుకుంటే ఆ ఛాన్స్ ఇచ్చింది మాత్రం జగన్. దాన్ని ప్రూవ్ చేసింది జగన్. కాదంటారా ?