Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా సీమకి జలాలు తరలింపు అంశాన్ని జగన్ మెడకి చుట్టేయడానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు బాగా మొహమాటపడిపోయాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఆ పత్రికలూ ఆంధ్ర, తెలంగాణల్లో వేర్వేరు ఎడిషన్స్ ప్రింట్ చేస్తున్నాయి. అక్కడి ప్రజల మనోభావాలకు తగ్గట్టు వార్తలు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సీమకి ఏపీ సర్కార్ నీళ్లు తరలించడానికి చేసిన ప్రయత్నాన్ని సాక్షి కూడా ఇలాగే చూసింది. అందుకే తెలంగాణ ఎడిషన్ లో ఏపీ సర్కార్ నీళ్లు తోడేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇచ్చింది. దాని వల్ల సీమ రైతులకి కలిగే ఇబ్బందుల్ని కించిత్ కూడా పట్టించుకోలేదు. ఇక వైసీపీ అధినేత జగన్ ఆంధ్రాలో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే పత్రిక ఇలా ఏపీ ప్రజలకు కీడు చేసే చర్యలకు పాల్పడితే ఎలా ? ఈ విషయాన్ని సాక్షి తెలంగాణ ఎడిషన్ నడిపిస్తున్న వాళ్ళు పట్టించుకుని వుండాల్సింది. లేకుంటే జగన్ తరపున ఈ విషయంలో ఎవరైనా జాగ్రత్త తీసుకోవాల్సింది.
సాక్షి పత్రిక శ్రీశైలం నుంచి జలాల తరలింపు విషయంలో ఇచ్చిన కధనం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. సహజంగా సాక్షి, జగన్ కి వ్యతిరేకంగా ఏ వార్త వచ్చినా రెచ్చిపోయే ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా తమ సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకుని మౌనం దాల్చాయి. అయితే ఆ పత్రికలు వదిలేసినంత మాత్రాన సీఎం చంద్రబాబు ఈ అవకాశాన్ని వదులుకుంటారా ? ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టడానికి సాక్షి, జగన్ ప్రజల నోట్లో మట్టికొట్టడానికి, వారి నోటి దగ్గర నీటిని లాగివేయడానికి కూడా సిద్ధమని నిరూపించగలిగారు. ఈ విషయం లో ఎవరికైనా అనుమానాలు ఉన్నప్పటికీ సాక్షి పత్రిక కధనం చూసాక దీనిపై మాట్లాడేందుకు వైసీపీ నాయకులు కూడా ముందుకు రావడం లేదు. మరీ ముఖ్యంగా ఆ పార్టీ సీమ నాయకులు సాక్షి మీద నిప్పులు చెరుగుతున్నారు.