Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలిపై ఆంత్రాక్స్ దాడి జరిగిందన్న ప్రచారం కలకలం సృష్టించింది. అయితే విచారణ తర్వాత ఆమెకు పార్సిల్ లో వచ్చింది ఆంత్రాక్స్ పొడి కాదని, అలాగే అది ప్రమాదకరమైన పౌడర్ కూడా కాదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భార్య వానెస్సా ట్రంప్ వారి ఇంటికి వచ్చిన ఓ కవర్ ఓపెన్ చేశారు. వెంటనే అందులోనుంచి ఓ తెల్లని పౌడర్ ఆమెపై పడింది. దీంతో ఆమెకు తలతిరగడం, వికారంగా అనిపించడంతో కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే ఆమెను హుటాహుటిన న్యూయార్క్ లోని ఆస్పత్రికి తరలించారు. వానెస్సాతో పాటు ఆమె తల్లి, ఇంట్లోనే ఉన్న మరో బంధువు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఆ పౌడర్ ప్రమాదకరమైంది కాదని స్పష్టమైనట్టు అధికారులు వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పేరిట ఈ కవర్ వచ్చిందని, న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అధ్యక్షుడి కుమారుడికి ఇలాంటి అనుమానాస్పద పార్సిల్ రావడంతో అమెరికా అధికారులు అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడిని, ఆయన కుటుంబ సభ్యుల్ని రక్షించే అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. అమెరికాలో 2001లో ఇలా కవర్స్ లో ఆంత్రాక్స్ వ్యాప్తిచేసే పౌడర్ పంపించడంతో మీడియా, రాజకీయ రంగాలకు చెందిన ఐదుగురు చనిపోయారు. పార్సిల్ లో పౌడర్ అనగానే అందరికీ ఈ ఘటనే గుర్తుకువచ్చి…ఆంత్రాక్స్ గా భావించి ఆందోళన చెందారు. వానెస్సా, తమ పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని, డొనాల్డ్ జూనియర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఈ ఘటన చాలా భయాన్ని కలిగించిందని, వ్యతిరేకతను వ్యక్తంచేయడానికి ఇలా చేయడం చాలా అసహ్యంగా ఉందని ట్వీట్ చేశారు. వానెస్సా, డొనాల్డ్ జూనియర్ కు ఐదుగురు పిల్లలు ఉన్నారు.