Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల నోటిఫికేషన్ రాబోయే కొద్ది రోజుల ముందు పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితుల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ సాగింది. అయితే ఎంత నిరసన వ్యక్తం అయినా అధికార పక్షం, విపక్షం ఒకే మాటపై ఉండటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తేవడానికి, రాహుల్ గాంధీని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టడానికి సోనియా చివరి క్షణాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఇక ఆ పాపం తమ చేతికి అంటకుండా జరగాల్సిన పని జరిగిపోతుందని బీజేపీ కూడా చూసీచూడనట్టు వూరుకుందని ఆంధ్రులు వాపోయారు. నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రమే కాదు. అంతకు మించిన వ్యూహంతో కాంగ్రెస్, బీజేపీ పావులు కదిపాయి.
దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగేకొద్దీ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ శక్తి తగ్గుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా దేశ రాజకీయాలకు గుండెకాయ లాంటి యూపీ లో ఈ పరిస్థితి కళ్ళకు కట్టింది. కాంగ్రెస్ కి తిరుగులేని ఆ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ ఏర్పాటు అయ్యాక సంకీర్ణ రాజకీయాలు వచ్చాయి. అస్థిర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఒక్కో ప్రభుత్వం పడిపోయే కొద్ది జాతీయ పార్టీలు దెబ్బ తినడం, ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడం చూసాం. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ కి పూర్వ వైభవం రాలేదు. బీహార్ లోను హస్తానిది అదే పరిస్థితి. 2014 ఎన్నికల ముందు బీజేపీ ఆలోచన కూడా ఒక్కటే. ఈ ఎన్నికల్లో అధికారం లోకి వచ్చాక ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ తో వేగడం కన్నా ఒకే జాతీయ పార్టీ తో పోరాటం మేలని కమలనాధులు భావించారు. ఈ క్రమంలో ప్రాంతీయ శక్తుల్ని దెబ్బ తీయాలంటే ముందుగా పార్లమెంట్ లో వాటి వాణి బలంగా వినిపించకూడదని భావించారు. అలా జరగాలంటే ఆయా ప్రాంతీయ పార్టీల బలం తగ్గాలి. అంటే రాష్ట్రాలు చిన్నవి అయితే ప్రాంతీయ పక్షాలు కేవలం జాతీయ పార్టీల తోకలుగా మిగిలిపోతాయని కాంగ్రెస్, బీజేపీ భావించాయి. దేశ రాజకీయాల్ని ఇక మీరో ,మేమో ఏలుకోవచ్చన్న అనధికారిక ఒప్పందానికి బీజేపీ, కాంగ్రెస్ వచ్చేసాయి. వారి వ్యూహానికి ప్రయోగ వేదికగా నిలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఎపిసోడ్. ఈ సీన్ రసవత్తరంగా సాగింది. వాళ్ళు అనుకున్నట్టే తెలుగు వాళ్ళ కోసం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడే ఆ పార్టీలు తమ భవిష్యత్ ని బంగారంగా వూహించుకున్నాయి. కానీ తెలుగోడి దెబ్బకు ఆ రెండు జాతీయ పార్టీలకు దిమ్మ తిరిగింది.
ఇక్కడ తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, సహకరించామని బీజేపీ జబ్బ చరుచుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఏపీ లో కాంగ్రెస్ కి చావు దెబ్బ తగిలింది. ఇక టీడీపీ ఊతం ఉన్నప్పటికీ బీజేపీ కూడా పెద్దగా పొడిచిందేమీ లేదు. అయితే కాలం గడిచేకొద్దీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బ తీసి తాము పాతుకుపోదామని రెండు జాతీయ పార్టీలు అనుకున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రం లో అధికారంలో వున్న అమిత్ షా, మోడీ ద్వయం వేయని ఎత్తు లేదు. మిత్రపక్షం టీడీపీ ని కూడా నానా ఇబ్బందులు పెట్టి చోద్యం చూసారు. అయినా నో యూజ్. నంద్యాల ఎన్నికల ఫలితం చూసాక బీజేపీ కళ్ళు తెరుచుకున్నాయి. అటు తెలంగాణలోనూ బీజేపీ కేంద్ర నాయకులు హడావిడి చేయడం తప్ప రాష్ట్ర స్థాయి నాయకులు ఏ దశలోనూ తాము గట్టి పోటీ ఇవ్వగలమన్న నమ్మకం కూడా కల్పించలేకపోయారు. అందుకే ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ తెలుగు రాష్ట్రాల మీద ఆశ వదులుకుంది.కాంగ్రెస్ కూడా అదే బాటలో వుంది. విభజన అస్త్రాన్ని ఎంత వాడిగా ప్రయోగించినా తెలుగు ప్రజలు కరుణించకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ షాక్ తిన్నాయి.
ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఆశించినట్టు ప్రాంతీయ శక్తులు దెబ్బ తిని, జాతీయ శక్తులు పుంజుకుని ఉంటే దేశంలో చాలా చిన్న రాష్ట్రాలు ఇప్పటికే ఏర్పడి ఉండేవి.కానీ తెలుగు ప్రజలు ఓటు, రాజకీయ నిర్ణయంతో కాంగ్రెస్ , బీజేపీ ఆత్మశోధనలో పడ్డాయి. అందుకే ఒకప్పుడు చిన్న రాష్ట్రాలు అని ఊదరగొట్టిన బీజేపీ గడిచిన మూడేళ్ళలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ విషయం మర్చిపోయినట్టే వ్యవహరిస్తోంది. ఇక కాంగ్రెస్ తెలుగు ప్రజలు కొట్టిన చావు దెబ్బకి విభజన మాట ఎత్తితే ఉలిక్కిపడుతోంది. ఏదేమైనా సోనియా ,మోడీ ఉమ్మడి కుట్రకి తెలుగోడు బ్రేక్ వేసాడు. లేదంటే ఈ దేశం లో ఎన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడేవో ఏమో. ఒకవేళ భవిష్యత్ లో చిన్న రాష్ట్రాల అవసరం వచ్చినా అది పాలనా పరంగా అయి ఉండాలి తప్ప రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే జనం గూబ గుయ్యి మనిపిస్తారని కూడా జాతీయ పార్టీలకి చాటి చెప్పిన ఘనత కూడా తెలుగు ప్రజలదే.కాదంటారా ?