ఓట్ల వేటలో బాబు…పెన్షన్లు రెట్టింపు !

AP CM Announces Doubling Of All Pensions In Andhra Pradesh
ఎన్నికల కోడ్ రాక ముందే పలు జనాకర్షక పధకాల ద్వారా పొందే లబ్దిని రెట్టింపు చేసు, రాజకీయలబ్ది పొందే ప్రయత్నంలో చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పన్నెండు రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ నెల నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారని ప్రకటించారు. ఈ నెలది ఇప్పటికే ఇచ్చేసాం కాబట్టి అది వచ్చే నెలలో కలిపి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 54లక్షల మంది పించన్ దారులకు లబ్దిదారులు ఉన్నారు. వీరందరికీ సామాజిక భద్రతా పెన్షన్ రెట్టింపు అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు రెండు వందలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే పెన్షన్ రూ. 2వేలు ఇస్తానంటూ హామీ ఇచ్చి ప్రచారం చేశారు.
దానికి కౌంటర్ గా చంద్రబాబు నాయుడు ఏకంగా పెన్షన్లను పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు ఈ నెల నుంచే అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పెంచిన పెన్షన్ మొత్తం లబ్దిదారులకు ఒక సారి అందితే నమ్మకం కలుగుతుందని అది ఓట్లుగా మారుతుందని చంద్రబాబు అంచనా. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రావడం ఖాయమయింది. ఫిబ్రవరిలో ప్రకటిస్తే తొలిసారి పెరిగిన మొత్తం పెన్షన్ ఓటర్లకు పంపిణీ చేయడం ఇబ్బందికరం కావొచ్చు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక నెల ముందుగానే చంద్రబాబు పెన్షన్ పెంచడమే కాదు పెంచిన మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో సంక్షేమ లబ్దిదారులే కీలకంగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు కృతజ్ఞతగా ఓటు వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే జన్మభూమిలో పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెడుతున్నారు. మొత్తానికి బాబు నిర్ణయం టీడీపీ శ్రేణులకి మంచి బూస్ట్ గా మారగా వైసీపీ శ్రేణులకి మాత్రం ఇబ్బందిగా మారింది.